తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లల కోసం దాచిన సొమ్మంతా పోగొట్టావ్ - కాపురాల్లో 'సైబర్ క్రైమ్' చిచ్చు - Cyber Crime Impact on Families

Cyber Crime Impact on Families : సైబర్‌ నేరాలు పచ్చటి కాపురాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. లాభాల కోసం ఆశపడి మోసపోయిన బాధితుల పట్ల కుటుంబ సభ్యుల సూటిపోటి మాటలు మరింత మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. చివరకు భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. పిల్లల చదువులు, వివాహాల కోసం జమ చేసుకున్న సొమ్మంతా పోగొట్టావంటూ మొదలవుతున్న కలహాలు మానవ బంధాలను మరింత దిగజారుస్తున్నాయి.

Conflicts Due to Cyber Crime
Cyber Crime Impact on Families (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2024, 8:46 AM IST

Conflicts Due to Cyber Crime : రాష్ట్రంలో 90 శాతం సైబర్‌ కేసుల్లో విద్యావంతులే బాధితులుగా ఉంటున్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 85 వేల కేసులు రిజిస్టర్ అయ్యాయి. అందులో 3 వేల మంది బాధితులు గృహిణులు. టాస్కుల పేరుతో ఇంటి నుంచే డబ్బు సంపాదన, ఫేక్ యాడ్స్ తదితర మోసాల్లో వీరు బాధితులు. కొందరు గృహిణులు తమ దగ్గర సమయానికి డబ్బు లేకున్నా తెలిసినవారి దగ్గర నుంచి అప్పు చేసి, ఇంట్లో ఉన్న బంగారం, భర్త దాచిన నగదును నేరగాళ్లకు పంపిస్తున్నారు.

చేసిన అప్పును తీర్చలేక మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఒకెత్తయితే పురుషులది మరింత దీనస్థితి. మోసమని తెలియక కొందరు ఆస్తులు తాకట్టుపెట్టి మోసపోతున్నారు. రుణదాతల ఒత్తిడి భరించలేక మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు అప్పటికప్పుడు బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్ తీసుకుని మరీ నేరస్థులకు పంపిస్తున్నారు. మోసపోయామని తెలుసుకొని అదనపు కట్నం కావాలని ఇల్లాలును వేధించడం, చిన్న విషయాలకు దాడి చేయడం వంటి సమస్యలు మొదలవుతున్నాయి.

కుటుంబంలో కలహాలు : ఖైరతాబాద్‌కు చెందిన ఓ మహిళ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్ చేస్తోంది. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం పేరుతో అదనపు డబ్బుకు ఆశపడి రూ.4.5 లక్షలు పోగొట్టుకుంది. మోసపోయినట్లు గుర్తించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిల్లల కోసం దాచిన సొమ్మును పోగొట్టావంటూ భర్త సూటిపోటి మాటలతో వేధించడం ప్రారంభించాడు. ఇలాగే కొనసాగుతూ చివరకు విడాకుల వరకూ వెళ్లింది. చిన్నపిల్లలు ఇబ్బందిపడతారని పెద్దలు నచ్చజెప్పడంతో కలిసి ఉంటున్నారు.

పెట్టుబడులకు లాభాలిస్తామని సైబర్‌ నేరగాళ్ల ప్రకటన నమ్మి భాగ్యనగరవాసి రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. మధ్య తరగతి కుటుంబమే అయినా అధిక లాభాలకు ఆశపడి అప్పులు చేసి మరీ నేరగాళ్లకు డబ్బు జమ చేశాడు. చివరకు మోసమని తెలియడంతో అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచని పరిస్థితి. కుటుంబ సభ్యులు అతణ్ని తీవ్రంగా నిందించారు. దీంతో మనస్తాపానికి గురైన సదరు వ్యక్తి ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు.

అండగా నిలవాలి : చిన్న చిన్న పనులతో డబ్బు సంపాదిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఎక్కువ మంది మహిళలు, గృహిణులు సైబర్‌ నేరగాళ్ల వలలో పడిపోతున్నారు. సైబర్‌ నేరాల బారినపడితే ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదుచేయాలి. డబ్బు కోల్పోయామని కుంగిపోవద్దు. కుటుంబ సభ్యులు నిందించకుండా అండగా నిలవాలని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ డీసీపీ ధార కవిత తెలిపారు.

కమీషన్​కు ఆశపడి సైబర్​ నేరగాళ్లకు మీ బ్యాంక్​ అకౌంట్​ ఇస్తున్నారా? - అలా చేస్తే జైలుకే! - Cyber Frauds in Mancherial Dist

డేటింగ్ పేరుతో చీటింగ్- అందమైన యువతుల ఫొటోలతో అమెరికన్‌ యువకులకు ఎర - HYD Police Arrest Online Fraudster

ABOUT THE AUTHOR

...view details