Income Tax Addl. Commissioner on Tax : తప్పుడు క్లెయిమ్‌లు నమోదు చేసి ఆదాయపన్ను మినహాయింపులు పొందాలనుకుంటే భవిష్యత్‌లో చిక్కులు తప్పవని ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ రేంజ్ -5 అడిషనల్ కమిషనర్ పి. సుమిత హెచ్చరించారు. ఆదాయపు పన్ను సకాలంలో చెల్లింపు, మినహాయింపు మార్గాలు, జత చేయాల్సిన ధ్రువపత్రాల్లో అవకతవకలకు పాల్పడితే విధించే జరిమానాలు తదితర అంశాలపై హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌లోని లారస్ ల్యాబ్ కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఆదాయపన్ను శాఖ అడిషనల్ కమిషనర్ సుమిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులకు అడిషనల్ కమిషనర్ సుమితతో పాటు చార్టెర్డ్ అకౌంటెంట్ ఎన్.రామకృష్ణ శాస్త్రి పలు అంశాలను వివరించి అవగాహన కల్పించారు.
ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో గతేడాది నుంచి ప్రత్యేక అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సుమిత తెలిపారు. పన్ను చెల్లింపుదారులు తమ అడ్రస్, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా లేదా ఈ-ఫైలింగ్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ఆదే విధంగా అడ్రస్, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ మారితే విధిగా అప్డేట్ చేయాలని సూచించారు. పన్ను ఎగవేసేందుకు ఆదాయ వివరాలు దాచిపెట్టినా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, కెడ్రిట్, డెబిట్ కార్డులు, వాహనాలు కొనుగోలు ఇలా అన్ని రకాలుగా ఐటీ అధికారులకు సమాచారం అందుతుందని స్పష్టం చేశారు.