Impressing Persian Cats Breeds in Yellandu :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పట్టణంతో పాటు పల్లెల్లో పర్షియన్ జాతికి చెందిన పిల్లులను జంతు ప్రేమికులు ఎంతో ఆసక్తిగా పెంచుకుంటున్నారు. స్థానికంగా ఉండే ఫక్రుద్దీన్ హైదరాబాద్‌లో మూడేళ్ల క్రితం రూ.8 వేలతో పర్షియన్ జాతికి చెందిన రెండు పిల్లులను కొనుగోలు చేసి పెంచుకుంటున్నారు. సాధారణంగా అరబ్ దేశాల్లో కనిపించే ఈ మార్జాలాలు ఇప్పుడు మన వద్ద, పలు ప్రాంతాల్లోని నివాస గృహాల్లో, పెంపుడు జంతువుల్లో ఒకటిగా మారాయి.
ఎలుకల జోలికి వెళ్లవు : గుండ్రని ముఖం, చిన్న మూతి, ఒళ్లంతా వెంట్రుకలు, ఆకట్టుకునే కళ్లతో కనిపించే ఈ పిల్లులు పుట్టిన మూడు నెలల తర్వాత పాలు తాగవు. ఎలుకల జోలికి వెళ్లవు. ఫక్రుద్దీన్ కుమారులు ఆక్రం, ఫిరోజ్‌లో వీటి పెంపకం విషయంలో ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. ప్రతినెలా రూ.5-6 వేల వరకు వెచ్చించి ప్రత్యేక ఆహార పదార్థాలను వీటికి అందిస్తున్నారు. తొలుత తీసుకొచ్చిన వాటి ద్వారా వృద్ధిలోకి వచ్చిన సంతానాన్ని రెండుమూడు సార్లు విక్రయించారు. పర్షియన్ ఆడపిల్లి సాధారణంగా ఒక ఈతలో రెండు నుంచి ఐదు పిల్లలను పెడుతుంది.
Demand on Persian Cats Breed :మార్కెట్లో జంతు ప్రేమికులు ఒక్కోదాన్ని రూ.3 వేల నుంచి గరిష్ఠంగా రూ.10 వేల వరకు వెచ్చిస్తూ కొనుగోలు చేస్తున్నారు. తెల్ల పిల్లులకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఇల్లెందు పట్టణంలో నాలుగైదు కుటుంబాలు ఈ రకం పిల్లులను పెంచుతుండటం విశేషం. ఇప్పుడు వేసవి కాలం నేపథ్యంలో మనుషులు వినియోగించుకునే క్యాప్స్‌ను వీటికి అమరుస్తూ తమ జంతు ప్రేమను చాటుతున్నారు. పిల్లి కనబడగానే అపశకునం అని భావించే కాలం నుంచి పెంపుడు పిల్లి కనపడకపోతే కలవరపాటుకు గురయ్యే పరిస్థితులు ఈ జంతు ప్రేమికులకు కలుగుతుంది.