Telangana Govt Alert to Heavy Rains Today :నేడూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జీహెచ్ఎంసీ సహా పలు జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉస్మానియా, జేఎన్టీయూ, తెలంగాణ తదితర యూనివర్సిటీలు నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయడం సహా కాలేజీలకు సెలవు ప్రకటించాయి. సచివాలయంతో పాటు జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు తెరిచారు. వర్షాలు, వరదలపై సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
అధికారుల సెలవులు రద్దు : వరద ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని చెప్పిన సీఎం, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని విధుల్లో నిమగ్నం కావాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక ఏర్పాట్లు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అత్యవసర విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంవోకు పంపాలని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
వరద నీటిని వృథా చేయవద్దు : వరద నీటిని వృథా చేయకుండా ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నిల్వ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు ఎత్తిపోయాలని, రోజుకు టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని చెప్పారు. నంది, గాయత్రి పంపుహౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని సూచించారు. మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని ఎత్తిపోయాలని సీఎం ఆదేశించారు. రంగనాయక సాగర్ నుంచి నీటిని పంపింగ్ చేసి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని, అక్కడి నుంచి సింగూరు, నిజాంసాగర్ వరకు తరలించాలని రేవంత్ రెడ్డి తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డికి పీఎం మోదీ ఫోన్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను, నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షం, వరదతో వాటిల్లిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రాణనష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలపై ప్రధానికి సీఎం వివరించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని సీఎంకు ప్రధాని తెలిపారు.