Illegal Diesel Transportation Gang Arrest in Hyderabad : దేశంలో ఒక్కోచోట ఒక్కోరకంగా పెట్రోల్, డీజిల్ ధరలు తారసపడుతుంటాయి. అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం, ఉత్పత్తుల రవాణాను అనుసరించి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధర ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఓ గ్యాంగ్ ఏకంగా అక్రమ డీజిల్ రవాణాకు తెరలేపింది. చౌకగా కొని డైరెక్ట్‌గా డోర్ డెలివరీ చేస్తూ అక్రమార్జనను ఆర్జించింది. అటువంటి ఓ ముఠాను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
గ్యాంగ్ వద్ద నుంచి పోలీసులు భారీగా డీజిల్ స్వాధీనం చేసుకున్నారు. 9 మంది నిందితుల్లో ఏడుగురు అరెస్టు కాగా ఇద్దరు పరారీలో ఉన్నారు. బాలానగర్‌కు చెందిన డీజిల్ వ్యాపారి రాధాకృష్ణ, సూర్య వీరిద్దరు మరో ఏడుగురితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ ముఠా డీజిల్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో కావాల్సిన వాళ్లకు నేరుగా ఇళ్ల వద్దకే డీజిల్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి వట్టినాగులపల్లి కేంద్రంగా ముఠా అక్రమ డీజిల్ సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది.
Diesel Smuggling in Telangana : కర్ణాటకలో లీటరు డీజిల్ 86.39 రూపాయలు ఉండగా, తెలంగాణలో రూ.95.65 ఉంది. రెండు రాష్ట్రాల మధ్య రూ.9 తేడా ఉంది. దీన్ని ఆసరా చేసుకుని నిందితులు డీజిల్ అక్రమ రవాణాకు తెర తీశారని విచారణలో తేలింది. అయితే డీజిల్ వ్యాపారి రాధాకృష్ణ, సూర్య పరారీ అవ్వగా మిగతా ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే 10,800 లీటర్ల డీజిల్, రూ. 35 లక్షల విలువ చేసే 7 డీజిల్ ట్యాంకర్లు, ఇతర పరికరాలు, 5 చరవాణులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.