Telangana New Ration Cards : రాష్ట్ర ఆవిర్భావం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం పేద ప్రజలు నిరీక్షిస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత, పేదల సుదీర్ఘ నిరీక్షణ ఇప్పుడు ఫలించబోతోంది. ప్రస్తుత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో కీలకంగా ముందుకు వెళుతోంది. జనవరి 26 నుంచి జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెబుతూ వస్తోంది. మరికొద్ది రోజుల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా 6.68 కుటుంబాలు నూతన కార్డులను పొందడానికి అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించి, ఆ జాబితాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపించింది.
ఈ నెల 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, బస్తీ సభలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అక్కడి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితాను ఖరారు చేస్తారు. ఇలా జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌర సరఫరాల శాఖ కార్డులను మంజూరు చేస్తుందని తెలుస్తుంది.
వడబోత చేసిన తర్వాతనే రేషన్‌కార్డులు :200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఆరోగ్య శ్రీ, రూ.500కు గ్యాస్ సిలిండర్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు ఆధారం అవుతుంది. దీంతో రేషన్‌కార్డుకు బాగా డిమాండ్ ఏర్పడింది. ఇంతకు ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుని పరిశీలించే వారు. కానీ ఈసారి ప్రభుత్వం కొత్త పద్ధతిని అనుసరిస్తోంది. గత నవంబరులో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఎంపిక ఉంటుందని స్పష్టం చేసింది.
ఆ సభల్లో లబ్ధిదారుల సంఖ్య తగ్గొచ్చు, పెరగొచ్చు! :ఆ సర్వే ద్వారా రేషన్‌కార్డులు లేనివారి వివరాలను పౌర సరఫరాల శాఖ ఇప్పటికే తీసుకుంది. కొత్త కార్డులు కావాలన్న వారి, ఇప్పటికే ఉన్నకార్డుల్లో పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారి సమాచారాన్ని అధికారులు అప్పుడే వడబోసేశారు. ఈ ప్రక్రియ తర్వాత కొత్త కార్డులకు 6,68,309 కుటుంబాలు అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ అన్ని కుటుంబాల్లో కలిపి 11,65,052 మంది పేర్లు ఉన్నాయి. గ్రామ, బస్తీ సభల తర్వాత కొత్త కార్డులు, అందులో లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చు తగ్గులు ఉంటాయని సమాచారం.