HYDRA Survey On Alleged Encroachments In Ameenpur :అమీన్‌పూర్ మున్సిపాలిటీలో ఆక్రమణలపై సమగ్ర సర్వేకు హైడ్రా సిద్ధమైంది. పురపాలకసంఘం పరిధిలోని ఆయా కాలనీల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తున్న క్రమంలో సమగ్ర సర్వే చేపట్టాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. తమ కాలనీలోని పార్కులు, రహదారులతో పాటు కొన్ని ప్లాట్లను గోల్డెన్ కీ వెంచర్స్ సంస్థ ఆక్రమించుకుంటుందని వెంకటరమణ కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
సర్వేపారదర్శకంగా జరిగేందుకు సహకరించాలి :ప్రజల ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా అధికారులు వెంకటరమణ కాలనీలోని సర్వే నెం. 152, 153లోని పార్కులు, రహదారులను గోల్డెన్కీ వెంచర్స్ కబ్జా చేసినట్లు నిర్ధారించారు. ఈ విషయంపై మరింత లోతుగా సర్వే చేయాలని కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. వెంకటరమణకాలనీతోపాటు సమీప కాలనీల నుంచి కూడా హైడ్రాకు ఫిర్యాదులు వస్తుండటంతో సర్వే ఆఫ్ ఇండియా, ఏడీ సర్వే సంయుక్తంగా జాయింట్ సర్వే చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
గోల్డెన్ కీ వెంచర్స్‌తో పాటు పలువురు ఆక్రమణదారులు కాలనీ వాసులను తప్పుదోవ పట్టిస్తున్నారని, సర్వే పారదర్శకంగా జరిగేలా కాలనీ వాసులు సహకరించాలని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని ఆర్టీసీ కాలనీ, రంగారావు వెంచర్, చక్రపురి కాలనీ వాసులు కూడా ఏమైనా కబ్జాలుంటే ఫిర్యాదు చేయాలని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని రంగనాథ్ సూచించారు. మరోవైపు హైడ్రా దూకుడుతో ఆక్రమణదారులు ఆందోళన చెందుతున్నారు.