HYDRA Warning On Illegal Wall Construction :చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే కాదు ప్రజలకు నష్టాన్ని చేకూర్చేలా రహదారులను ఆక్రమించినా కూల్చివేత తప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. చుట్టుపక్కల కాలనీలకు దారులను మూసేస్తూ కాలనీ లేఅవుట్లకు గోడలు కట్టుకోవడం చట్టవిరుద్ధమన్నారు. ప్రహరీ నిర్మించుకోవడానికి అనుమతులు ఒప్పుకోవని తెలిపారు.
చట్టవిరుద్ధంగా అడ్డుగోడలు :చట్టవిరుద్ధంగా అడ్డుగోడలు నిర్మించి తమ కాలనీలకు దారి లేకుండా చేస్తున్నారంటూ సోమవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు చేశారు. ఇటీవల నారపల్లిలో నల్లమల్లారెడ్డి లేఅవుట్‌లో 4కి.మీ పొడవున లేఅవుట్ చుట్టూ నిర్మించిన ప్రహరీని కూల్చడంతో ఇతర ప్రాంతాల బాధితులు వరుసకట్టారు. మొత్తం 71 ఫిర్యాదులు ప్రజావాణికి అందాయి. వారం నుంచి రెండు వారాల్లో విచారణ పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. తమ ప్లాట్లను నల్ల మల్లారెడ్డి కబ్జా చేశారని ఘట్‌కేసర్ మండలం కొర్రెములకి చెందిన ఖాజా మీరన్ మొయినుద్దీన్ ఫిర్యాదు చేశారు. అల్వాల్‌లోని యాప్రాల్ నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువును కాపాడాలని యాప్రాల్ కుల సంఘాల జేఏసీ ఛైర్మన్ ఆర్.చంద్రశేఖర్ కోరారు.