Hydra Officials Visits Bengaluru : చెరువుల పునరుద్దరణ, విపత్తుల నిర్వహణపై అధ్యయనానికి హైడ్రా అధికారుల బృందం బెంగళూరు బాట పట్టింది. బుధవారం హైడ్రా అధికారులు బెంగళూరు వెళ్లగా, ఇవాళ కమిషనర్ రంగనాథ్ అక్కడికి చేరుకున్నారు. రెండు రోజుల పాటు బెంగళూరులోనే పర్యటించి అక్కడి చెరువుల పునరుద్దరణపై సీనియర్ శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రముఖులతో సమావేశం కానున్నారు. యెల్లంకలో ఉన్న కర్ణాటక స్టేట్ నాచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ను హైడ్రా అధికారుల బృందం సందర్శించనుంది.
బెంగళూరు పర్యటనలో హైడ్రా బృందం :నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ విపత్తు నిర్వహణపై సీనియర్ శాస్త్రవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి సెన్సార్స్ సహాయంతో పర్యవేక్షిస్తున్న మురుగునీటి వ్యవస్థను పరిశీలిస్తారు. బెంగళూరు కోర్ సిటిలో ఉన్న చెరువులను సందర్శిస్తారు. రెండో రోజు పర్యటనలో 'లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా' ఆనంద్ మల్లిగవాడ్తో సమావేశం కానున్న రంగనాథ్ కర్ణాటక ట్యాంక్ కన్జర్వేషన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014పై చర్చించనున్నారు.
ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో చెరువుల సందర్శన :అనంతరం ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని మార్గందోన్హల్లీ చెరువు, ఇన్ఫోసిస్ సంస్థ అభివృద్ధి చేసిన చెరువులను సందర్శించి అక్కడ అమలు చేసిన ఉత్తమ విధానాలు, సాంకేతికతను తెలుసుకోనున్నారు. ఇటీవల ఈ విషయాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆనంద్ మల్లిగవాడ్ తో చర్చించిన రంగనాథ్ ప్రత్యక్షంగా వాటిని పరిశీలించడం ద్వారా హైదరాబాద్లో చేపట్టాల్సిన పునరుద్దరణ చర్యలపై ఒక అంచనా ప్రకారం ప్రణాళికలు తయారుచేయనున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా నగరంలో ఐదు చెరువులను పునరుద్దరించాలని ఆదేశించిన నేపథ్యంలో హైడ్రా ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది.