HYDRA Demolish Wall in Narapally :చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే కాదు ప్రజలకు నష్టాన్ని చేకూర్చేలా రహదారులను ఆక్రమించినా బుల్డోజర్లతో హైడ్రా విరుచుకుపడుతోంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో రహదారులను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన 4 కిలోమీటర్ల ప్రహరీగోడను హైడ్రా కూల్చేసింది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి వద్ద ప్రముఖ విద్యావేత్త నల్ల మల్లారెడ్డికి చెందిన దివ్యానగర్ లేఔట్ చుట్టూ అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడపై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఉదయం అక్కడి చేరుకున్న హైడ్రా సిబ్బంది కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు రహదారికి అడ్డుగా ఉన్న ప్రహరీతో పాటు ఇతర నిర్మాణాలను నేలపట్టం చేశారు. దీంతో లేఔట్ ప్లాట్ల యజమానులు, కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.
నల్ల మల్లారెడ్డిపై ఫిర్యాదు :ఈ కూల్చివేతతో ఏకశిల లేఔట్, వెంకటాద్రి టౌన్‌షిప్, సుప్రభాత్ వెంచర్ -1, మహేశ్వరి కాలనీ, కాచవాణి సింగారం, ఏకశిల - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచర్ -2, 3, సాయిప్రియ, మేడిపల్లి, కొర్రేముల, వెంకటాపురం, పర్వాతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఈ లేఔట్ ప్రహరీ వల్ల చుట్టు పక్కల ప్రజలతో పాటు అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన సింగరేణి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన రంగనాథ్ జనవరి 8న క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. జనవరి 23న హైడ్రా ప్రధాన కార్యాలయంలో నల్ల మల్లారెడ్డితో పాటు బాధిత ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమై నిజానిజాలు తేల్చారు.
రోడ్లకు అడ్డంగా గేట్లు :దివ్యనగర్ లేఔట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకూ ఉంటుందని, అందులో 2218 ప్లాట్లు చేయగా వెయ్యి మంది వరకు సింగరేణి ఉద్యోగులు ప్లాట్లను కొనుగోలు చేశారు. మిగతా 30 శాతం ప్లాట్లు నల్ల మల్లారెడ్డివేనని, సర్వే నెంబరు 66లో 6.06 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా నల్ల మల్లారెడ్డి కబ్జాచేశారని స్థానికులు కమిషనర్‌కు వివరించారు. లేఔట్లలో 40 అడుగులు, 50 అడుగులు, 25 అడుగులు రహదారులు మూసివేసి అడ్డంగా గేట్లు పెట్టారని, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి తమ లేఔట్లలోకి రానివ్వడం లేదని సింగరేణి ఉద్యోగులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
మణికొండ వైపు దూసుకెళ్లిన హైడ్రా బుల్డోజర్లు - నెక్నాంపూర్లో 5 విల్లాలు నేలమట్టం