HYDRA Focus on Ameenpur Cheruvu : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పెద్దచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు మరింతగా దృష్టి సారించారు. ఇవాళ ఉదయం హైడ్రా అధికారులు సర్వే చేపట్టారు. గోల్డెన్ కీ, వాణీనగర్, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, వెంకటరమణ కాలనీలో రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. నవ్య చౌరస్తాలో అక్రమంగా కట్టిన భవనాన్ని రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు.
పలు నిర్మాణాల కూల్చివేతలు :పెద్దచెరువు కబ్జా చేసి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇళ్లు కట్టారని హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో, చెరువు పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.ఇదే ప్రాంతంలో నిర్మాణాలు కూల్చి మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. అలాగే అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి వాణిజ్య కార్యకలాపాల కోసం భవనాలను నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది. కిష్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ 164లో వాణిజ్యపరంగా నిర్వహిస్తున్న 3 ఐదంతస్తుల భవనాలను కూల్చివేశామని, అక్కడ ఎకరం ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వివరించింది.
పటేల్‌గూడలోని సర్వే నెంబర్ 12/2, 12/3లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 25 నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని హైడ్రా గుర్తించింది. వాటిని తొలగించి 3 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని 51 ఎకరాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వెంచర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అలాగే రోడ్లను సైతం ఆక్రమిస్తూ పద్మావతి నగర్లో ఏర్పాటు చేసిన అక్రమ లేవుట్‌కు సంబంధించిన ప్రహరీ గోడతో పాటు రెండు సెక్యూరిటీ గదులను హైడ్రా అధికారులు తొలగించారు.