తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై మరోసారి హైడ్రా ఫోకస్ - తక్షణమే వాటిని తొలగించేందుకు కార్యాచరణ - HYDRA COMMISSIONER RANGANATH VISIT

నగరంలోని పలు కీలక చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ - బాచుపల్లిలోని ఎర్రకుంట చెరువును పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని పునరుద్దరణ చర్యలు మొదలుపెట్టనున్నట్లు వెల్లడి - తుర్కచెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్

Hydra Ranganath Visits Key Lakes
Hydra Ranganath Visits Key Lakes (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2024, 8:58 PM IST

Hydra Ranganath Visits Key Lakes : చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా మరోసారి దృష్టి పెట్టింది. తక్షణమే వాటిని తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి పలు చెరువులను సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానికుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. చెరువుల వద్ద ఆక్రమణలను తొలగించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బాచుపల్లిలోని ఎర్రకుంట చెరువును పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని పునరుద్దరణ చర్యలు మొదలుపెట్టనున్నట్లు రంగనాథ్ తెలిపారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటన :చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటు పట్ల హైకోర్టు సానుకూలత వ్యక్తం చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టించిన హైడ్రా నీటి వనరుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతోంది.

ఈ క్రమంలో ఇప్పటికే 27 చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా కొన్ని రోజులపాటు కూల్చివేతలకు దూరంగా ఉంది. ఈ సమయంలో మేథావులు, విశ్రాంత ఇంజినీర్లు, న్యాయ నిపుణులు, పర్యావరణ ప్రముఖులతో సుదీర్ఘ సమావేశాలు నిర్వహించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువుల పునరుద్దరణపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు.

తదుపరి కార్యచరణ మొదలుపెట్టిన హైడ్రా :ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా బాచుపల్లిలోని ఎర్రకుంట చెరువును పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకున్నారు. ఆ చెరువులోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసి వ్యర్థాలను తొలగించిన హైడ్రా అక్కడ తదుపరి కార్యాచరణను మొదలుపెట్టింది. ఆ ప్రాంతాన్ని రంగనాథ్ మరోసారి సందర్శించి అక్కడ చేయాల్సిన అభివృద్ధిపై స్థానికులు, అధికారులతో చర్చించారు. అలాగే స్థానికుల ఆహ్వానం మేరకు బండారి లేఔట్​ను సందర్శించిన రంగనాథ్ సమీపంలోని తుర్కచెరువును పరిశీలించారు. చెరువులో ఆక్రమణలతోపాటు కలుషితనీరు కలుస్తుందని ఫిర్యాదు చేశారు.

Ranganath On Lakes Protection :చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన రంగనాథ్ తుర్కచెరువు అభివృద్ధి కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని తెలిపారు. మాదాపూర్ లోని మేడి కుంట చెరువు, ఈదులకుంట, నార్సింగ్ లోని నెక్నాంపూర్ చెరువు, తెల్లాపూర్ లోని వనం చెరువు, చెల్లికుంట, మేళ్ల చెరువులను పరిశీలించి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. రెవెన్యూ అధికారులతో కలిసి ఈదులకుంట చెరువును సందర్శించారు.

విలేజ్ మ్యాప్​ను పరిశీలించారు. ఖానామెట్ సర్వే నెంబర్ 7లో 6 ఎకరాల 5 గుంటల విస్తీర్ణంలో ఉన్న చెరువులో ఓ స్థిరాస్తి సంస్థ భవన వ్యర్థాలతో పూడ్చేస్తుందని సీపీఎం నాయకులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా విలేజ్ మ్యాప్​ను పరిశీలించిన రంగనాథ్ రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తానని తెలిపారు.

ఈదులకుంట ఆక్రమణలు తక్షణమే తొలగిస్తాం :ఈదులకుంట చెరువు ఏ మండలం పరిధిలోకి వస్తుంది? ఓవర్ ల్యాపింగ్ ఎలా అయింది? గతంలో చేసిన సర్వే వివరాలు ఏంటి? రికార్డులు ఎక్కడున్నాయంటూ కూకట్ పల్లి, శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. గతంలో సర్వే చేసిన రిపోర్టులను పునఃపరిశీలించారు. ఈదులకుంట చెరువు ఆక్రమణలను తక్షణమే తొలగిస్తామని, ఆ చెరువు పునరుద్దరణకు అన్ని చర్యలు చేపడతామని స్థానికులకు హామీ ఇచ్చారు. నగర పరిధిలో అత్యధికంగా శేరిలింగంపల్లి మండలంలోనే చెరువులు కబ్జాలకు గురైనట్లు రంగనాథ్ అభిప్రాయపడ్డారు.

ఫిర్యాదుల వెల్లువ :క్షేత్రస్థాయి పర్యటనలో రంగనాథ్​కు స్థానికుల నుంచి రకరకాల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చెరువుల సుందరీకరణపేరుతో కట్టల చుట్టూ నిర్మించి బఫర్ జోన్ ప్రాంతాలను కబ్జా చేస్తున్నారని, గేటెడ్ కమ్యూనిటీల నుంచి మురుగు చేరి చెరువులు కలుషితం అవుతున్నాయని స్థానికులు వివరించారు. ప్రతి చెరువును కాపాడేందుకు హైడ్రా కృషి చేస్తుందని, చెరువులు కబ్జా కాకుండా చూస్తామని రంగనాథ్ స్థానికులకు హామీ ఇచ్చారు. చెరువుల పూర్తి వివరాలు సేకరించి కబ్జా కాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

మరోవైపు ఖాజాగూడలోని భగీరథమ్మ చెరువు అన్యక్రాంతంపై హైడ్రా అధికారులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంధ్యా కన్వెన్క్షన్ యజమాని శ్రీధర్ రావు చెరువు బఫర్ జోన్​లో మట్టివేసి పూడ్చివేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

'మా ఇల్లు బఫర్​ జోన్​లో లేదు - ఎందుకు సోషల్​ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు'

అయోమయంలో హైడ్రా - చెరువులు, కుంటల లెక్క తెలియక సందిగ్ధం

ABOUT THE AUTHOR

...view details