HYDRA Commissioner Press Meet : అనధికారిక నిర్మాణాల విషయంలో సానుభూతి చూపించాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే హైదరాబాద్ లో హైడ్రా పనిచేస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్న భూకబ్జాదారులకు కూడా హైడ్రా అంటే ఏంటో త్వరలోనే అర్థమవుతుందన్నారు. హైడ్రా ఏర్పడిన 6 నెలల్లోనే 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడినట్లు రంగనాథ్ వెల్లడించారు.
హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా వచ్చే ఏడాది మరింత దూకుడుగా వ్యవహరించబోతుందని ఆ ఏజెన్సీ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పడి 6 నెలలు పూర్తైన సందర్భంగా 2024లో చేసిన పనులను ఆయన వెల్లడించారు. హైడ్రా లక్ష్యం నెరవేరిందన్నారు. భూముల కబ్జాలను అడ్డుకోవడంతోపాటు లేక్ వ్యూ పేరుతో ఇళ్లను నిర్మించుకునే వారికి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల విషయంపై అవగాహన పెరిగిందన్నారు. అలాగే స్థిరాస్తి రంగం కూడా క్రమపద్దతిలో వెళ్లేందుకు హైడ్రా దోహదపడుతుందన్నారు. గడిచిన 6 నెలల్లో నగరంలో 27 ప్రాంతాల్లో 314 అనధికారిక నిర్మాణాలను కూల్చివేసి 200 ఎకరాల ప్రభుత్వ భూములను రక్షించినట్లు రంగనాథ్ వివరించారు.
అంతకు ముందు నిర్మించిన వాటి జోలికి వెళ్లం :అందులో 12 చెరువులు, 8 పార్కులను అన్యక్రాంతం కాకుండా కాపాడినట్లు హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది హైడ్రా పక్కాగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 1095 చెరువుల్లో శాటిలైట్ ఇమేజ్, ఏరియల్ డ్రోన్స్‌తో తీసిన ఫొటోల ఆధారంగా ఎఫ్టీఎల్ మార్కింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. 2024 జులై 19 తర్వాత కట్టే అనధికారిక, అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని పునరుద్ఘాటించారు. అంతకుముందు నిర్మించిన వాటి జోలికి వెళ్లమని హైడ్రా కమిషనర్ మరోసారి స్పష్టం చేశారు.
హైడ్రా సామాన్యులను ఇబ్బందిపెట్టే వ్యవస్థ కాదని రంగనాథ్ అన్నారు. ఉన్నత న్యాయస్థానాలు కూడా అనధికారిక నిర్మాణాల పట్ల కఠినంగానే వ్యవహారించాలని ఆదేశిస్తున్నాయన్నారు. ఆ దిశగానే హైడ్రా పనిచేస్తుందని వివరించారు. హైడ్రాపై కొందరు భూకబ్జాదారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చెరువుల భూములను కబ్జా చేసి వ్యవస్థను మ్యానేజ్ చేయాలనుకునే వారిని హైడ్రా ఖచ్చితంగా అడ్డుకుంటుందని హెచ్చరించారు. చెరువుల సమీపంలో భూములు కొనుగోలు చేసే వారు, ఇళ్లను నిర్మించుకునేవారు ఒకటికి రెండు సార్లు తనిఖీలు చేసుకోవాలని సూచించారు.