Hydra Commissioner Orders Survey Of All Ponds :హైడ్రా ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కు స్థలాల్లోని నిర్మాణాలన్నీ నేలమట్టం అవుతాయని, ఆక్రమణలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో నగరంలో ప్రజలు జీవించలేరంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. తుది నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగకుండా వెంటనే అన్ని చెరువులను సర్వే చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆగస్టు తర్వాత జరిగినటువంటి ప్రతి నిర్మాణాన్ని గుర్తించాలని, వారం రోజుల్లోగా వాటిని కూల్చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా బుల్డోజర్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే గుర్తించిన బీరంగూడ, గాజులరామారం, తదితర చెరువుల సంరక్షణకు కాలు దువ్వుతున్నాయి.
నిబంధనల ప్రకారం :2024 జులైలో హైడ్రా ఏర్పాటైందని అంతకు ముందు వాటిని (అనుమతి ఉన్నా, లేకున్నా) కూల్చబోమని రంగనాథ్ స్పష్టం చేశారు. వ్యాపారం కోసం కట్టుకున్నటువంటి షెడ్లను కూల్చుతామన్నారు. ఆగస్టు, 2024 నుంచి చేపట్టినటువంటి నిర్మాణాలు మాత్రం నేలమట్టం చేయనున్నట్లు తెలిపారు. ఏదో ఓ రోజు కూల్చేస్తాం" హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
ఉపగ్రహ చిత్రాలు(శాటిలైట్ ఇమేజీలు) ఆధారంగా : ఔటర్ రింగ్ రోడ్డు(బాహ్య వలయ రహదారి) వరకు గ్రామాల వారీగా అన్ని చెరువులను సర్వే చేసి, బఫర్ జోన్ లోపల కట్టిన నిర్మాణాలను గుర్తించాలని హైడ్రా నిర్ణయించింది. అందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ), సర్వే ఆఫ్ ఇండియా, గూగుల్ పటాలను ఉపయోగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూన్, జులై నెలల్లో చిత్రీకరించిన చెరువుల ఉపగ్రహ చిత్రాలను, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోని పటాలను పరిశీలించాలని, చెరువుల అంచుల్లో చోటు చేసుకున్న వ్యత్యాసాలను లెక్క తేల్చాలని చెప్పారు.