Hydra Commissioner Ranganath Meeting With Lake Man Of India:చెరువుల పునరుద్దరణ కోసం చేపట్టిన చర్యలపై అధ్యయనానికి హైడ్రా అధికారులు బెంగళూరు వెళ్లాలని చూస్తున్నారు. అక్కడ అతి తక్కువ ఖర్చుతో చెరువులకు జీవం పోసిన విధానాన్ని పరిశీలించాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఆనంద్ మల్లిగవాడ్‌తో తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన రంగనాథ్ బెంగళూరులో 35 చెరువుల పునరుద్దరించిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
బెంగళూరులో ఏర్పాటు చేసిన విధానంపై హైడ్రా: ఆనంద్‌ను హైదరాబాద్‌కు పిలిపించి ఇక్కడ చెరువుల పునరుద్దరణపై సహకారం అందజేయాలని రంగనాథ్ కోరారు. అలాగే చెరువుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి స్వచ్ఛమైన నీరు చెరువుల్లోకి చేరేలా ఏర్పాట్లు చేయాలని హైడ్రా నిర్ణయించింది. మురుగు నీటి కాలువల నుంచే శుద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించి చెరువులోకి చేరే ముందు మూడు నాలుగు దశల్లో నీరు ఉంచి ఫిల్టర్ చేసిన తీరుపై హైడ్రా దృష్టి పెట్టనుంది. మురుగు నీటి కాలువలకు రెండు వైపులా మొక్కలు నాటడం, చెరువుకు చేరేలోపే కొంతమేర శుద్ధి జరిగేలా బెంగళూరులో ఏర్పాటు చేసిన విధానంపై అధ్యయనం చేయనుంది. చెరువుల పునరుద్దరణ కోసం స్థానికులను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం కల్పించి వారికే నిర్వహణ బాధ్యతలు స్వచ్ఛందంగా తీసుకునేలా హైడ్రా కసరత్తు చేస్తోంది.