Hyderabad Police Arrested 18 Cyber Criminals :దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతూ రూ.కోట్ల డబ్బు కొల్లగొడుతున్న కీలక ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ కేటుగాళ్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్ తదితర రాష్ట్రాలకు చెందిన సైబర్ నేరుస్థులను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 18 మంది నిందితులను అరెస్టు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు.
నిందితుల ఖాతాల్లోని రూ.1.61 కోట్ల నగదు సీజ్ :నిందితులపై పలు రాష్ట్రాల్లో 319 కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం తెలంగాణలో నమోదైన కేసుల్లో బాధితుల నుంచి దాదాపు రూ.7 కోట్లు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. సెక్స్ టార్షన్, కొరియర్, పెట్టుబడి పేరుతో సైబర్ మోసాలకు పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుల వివిధ బ్యాంకు ఖాతాల్లోని రూ.1.61 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. వారి వద్ద నుంచి రూ.5 లక్షల నగదు, 26 సెల్ ఫోన్లు, 16 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ట్రేడింగ్, డేటింగ్ ఫ్లాట్‌ఫాంలతో జాగ్రత్త :ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్జప్తి చేశారు. పెట్టుబడి ప్లాట్ ఫారమ్‌లు, అనధికార ట్రేడింగ్ సైట్‌లు, ఫెడెక్స్ కొరియర్, డేటింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. భయంతో లేదా సరైన ధ్రువీకరణ లేకుండా ఎవరికీ డబ్బు పంపవద్దని కోరారు. సైబర్ క్రైమ్‌లో మోసపోయినట్లు అనుమానం వస్తే, వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ ద్యారా, డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.