People Are Interest in Buying Houses In Goa : పర్యాటకుల తాకిడితో ఎప్పుడూ కోలాహలంగా ఉండే నగరం గోవా. వరుసగా సెలవులు వస్తే చాలు అందరూ అక్కడ సేద తీరేందుకు వెళ్లడానికి ప్లాన్ చేస్తుంటారు. ఈ మధ్య ఉత్తరాది, దక్షిణాదితో సంబంధం లేకుండా అందరూ గోవాకే వెళ్తున్నారు. అక్కడి అరేబియా సముద్ర తీరంలోని ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. తరచూ వెళ్తుండటంతో హోటళ్లు, రిసార్టుల్లో బస చేస్తుంటారు. వీటికి ఎక్కువగా ఖర్చు అవుతుండటంతో అక్కడే ఒక ఇల్లు కొనాలని ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. హాలిడే హోమ్స్‌కు ప్రముఖ గమ్యస్థానంగా ఉన్న గోవాను నివాస కేంద్రాలకు ప్రాధాన్య ప్రదేశంగా 35 శాతం మంది ఎంచుకుంటున్నట్లు ఇండియా సోథెబైస్ ఇంటర్నేషనల్ రియాల్టీ (ఐఎస్‌ఐఆర్) సర్వేలో తేలింది.
గోవాలో రియల్ ఎస్టేట్ : విదేశాలను తలపించే జీవనశైలి, ఆకర్షణీయమైన సహజ సౌందర్యం, గొప్ప సాంస్కృతిక వారసత్వం, సకల సౌకర్యాలు కల్గిన పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది గోవా. గోవాకి ఒక్కసారి వెళితే చాలు మనసును కట్టిపడేస్తుంది. మళ్లీ మళ్లీ రప్పించుకుంటుంది. సాధారణంగా అక్కడికి వెళ్లేవారు హోటళ్లు, రిసార్టుల్లో బస చేస్తుంటారు. అధిక ఆదాయ వర్గాలైతే ఏకంగా ఇళ్లను కొనేస్తున్నారు. ఇప్పుడు గోవాలోనూ పోకడలు మారాయి. పాక్షిక యాజమాన్య అవకాశాన్ని స్థానిక రియాల్టీ సంస్థలు కల్పిస్తున్నాయి. ఖరీదైన స్థిరాస్తుల్లోనూ తమ వద్ద ఉన్న పెట్టుబడితో పాక్షిక వాటాలను కొనుగోలు చేయడానికి అవకాశం ఇస్తున్నాయి. గోవాలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఆధునికతకు పెద్ద పీట వేస్తున్నారు. దీనికి తగ్గ మౌలిక వసతుల కల్పన కోసం అక్కడి ప్రభుత్వం శ్రమిస్తోంది.
అంతర్జాతీయ విమానాశ్రయం: గోవాకు రహదారి, రైల్వే, విమాన సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వారంలో రెండు రోజులు రైలు సౌకర్యం ఉండగా, ఇటీవల మరొకటి ప్రారంభించారు. రోజు మొత్తం ప్రయాణం చేసేంత ఓపిక లేనివారు ఖర్చుకు వెనకాడకుండా విమానాల్లో వెళ్తున్నారు. ఉత్తర గోవాలో ఇటీవలె అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. దీంతో ప్రపంచ దేశాలతో అనుసంధానం పెరిగింది. ఇవన్నీ ఆ పర్యాటక ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. నివాస, వాణిజ్య రియల్ ఎస్టేట్‌పై దీని ప్రభావం ఉందని మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి.