Hyderabad Metro Disrupted Few Minutes : హైదరాబాద్‌లోని మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్ (రెడ్ లైన్) వరకు వెళ్లే మెట్రో రైలు మార్గంలో సాంకేతిక సమస్య ఉత్పన్నం కావడంతో చైతన్యపురి మెట్రో స్టేషన్‌లో కొన్ని నిమిషాలపాటు ఓ మెట్రో రైలు నిలిచిపోయింది. ఈ క్రమంలో మూడు నాలుగు నిమిషాల ఆలస్యం కారణంగా అన్ని మెట్రో స్టేషన్లలో కొద్ది క్షణాల్లోనే ప్రయాణికుల రద్దీ పెరిగింది.
విద్యుత్ ఫీడర్లో సమస్య : ప్రయాణికుల రద్దీతో అమీర్‌పేట జంక్షన్ స్టేషన్‌లో ఫ్లాట్ ఫామ్ కిటకిటలాడింది. రైలు కోసం వేచి చూస్తుండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఫీడర్ ఛానల్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు మెట్రో సిబ్బంది తెలిపారు. కొద్ది సమయం పాటు తక్కువ వేగంతో మెట్రో రైళ్లను నడిపారు. ఎల్‌బీనగర్- మియాపూర్ మార్గంలో మెట్రో రైళ్ల ఆలస్యం కారణంగా ప్రతి మెట్రో స్టేషన్ వద్ద కూడా రద్దీ పెరిగి ప్రయాణికులు అసౌర్యానికి గురయ్యారు.
దాదాపు అరగంట పాటు ఈ అసౌకర్యం, సాంకేతిక సమస్య ప్రభావం కనిపించింది. మెట్రో సిబ్బంది అనౌన్స్మెంట్ ఇస్తూ ప్రియమైన ప్రయాణీకులారా సాంకేతిక లోపం కారణంగా ఈ ఉదయం బ్లూ లైన్‌లో నడిచే రైళ్లలో స్వల్ప ఆలస్యమైందని... ఇప్పుడు సర్వీసులు పునరుద్ధరించబడ్డాయని వెల్లడించారు. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం... మీ సహకారానికి ధన్యవాదాలు అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. అరగంట తర్వాత సమస్యను పరిష్కరించడంతో యథావిధిగా మెట్రో రైళ్లు నడిచాయి.