Hyderabad Metro 2nd Phase Update : మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 8న పాతబస్తీలో రెండో దశకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5. కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులు మొదలు పెట్టనున్నారు. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్ నుమా వరకు మార్గంలో నాలుగు స్టేషన్లతో ఈ కారిడార్ అందుబాటులోకి రాబోతుంది. రెండో దశలో మొత్తం 70 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రూట్ మ్యాప్‌లను ఖరారు చేసింది. అందులో భాగంగా ఈ నెల 8న రెండో దశలోని 5.5 కిలో మీటర్ల మార్గానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం మెట్రో రైలు మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంది.
మెట్రో రెండో దశ కొత్త మార్గాలపై అధికారుల మేధోమథనం - చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ జంక్షన్!
మెట్రో రైలు రెండో దశ : మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు కనెక్టివిటీ ఉంది. కాగా ఈ 5.5. కిలోమీటర్లు అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా నేరుగా ఫలక్ నుమాకు చేరుకోవచ్చు. కారిడార్ 4, 5, 6, 7 మార్గాల్లో రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసిన ప్రభుత్వం వాటి నిర్మాణానికి శంకుస్థాపన ఎప్పుడనేది వెల్లడించాల్సి ఉంది.
భాగ్య నగరంలో మెట్రో రైలు రెండో దశ కొత్త మార్గాల ప్రతిపాదనలపై ఆదివారం మేధోమథనం జరిగింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైలు లిమిటెడ్ (HAML) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ నిపుణులు, దీనిపై మెట్రో సీనియర్ అధికారులతో మెట్రోరైలు భవన్‌లో విస్తృతంగా చర్చించారు. ప్రతిపాదిత కొత్త మార్గాల్లో సవాళ్లు, సంక్లిష్టతలు, సాధ్యమయ్యే సాంకేతిక పరిష్కారాలపై సమాలోచనలు ఈ సమావేశంలో జరిపారు.