Goodeebag App To Prevent Plastic Usage :హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అభిషేక్ డిగ్రీ పూర్తి చేశారు. చదువుకునే సమయంలో తండ్రికి చెందిన వస్త్ర దుకాణాన్ని చూసుకునే వాడు. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం నిర్వహించాలనే ఉద్దేశంతో లాజిస్టిక్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో 2022 ఫిభ్రవరిలో గూడీబ్యాగ్ అనే మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులో తీసుకొచ్చారు.
ప్లాస్టిక్ ఇస్తే పైసలు ఇస్తారు :గూగుల్ ప్లే స్టోర్‌లోని వెళ్లి గూడీబ్యాగ్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అడిగిన వివరాలు అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత గూడీబ్యాగ్ సిబ్బంది మీ ఇంటికి వచ్చి 15కేజీల బ్యాగ్ ఇస్తుంది. మీ ఇంట్లో ఉన్న ఎలాంటి వ్యర్థాలనైనా అందులో నింపి వారికి సమాచారమిస్తే సిబ్బంది ఇంటికొచ్చి వాటిని తీసుకెళ్తారు. కేవలం ప్లాస్టిక్ మాత్రమే కాకుండా ఇనుము, ఇతర ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సైతం బ్యాగులో వేయవచ్చు. గూడీ బ్యాగ్ మొబైల్ అప్లికేషన్‌లో వచ్చే ఒక్కో రివార్డు పాయింట్, ఒక రూపాయి విలువగా పరిగణించి వాటిని వినియోగించుకోవచ్చు అంటున్నారు గూడీబ్యాగ్ సీఈవో అభిషేక్.
రెండేళ్ల క్రితం ప్రారంభమైన గూడీబ్యాగ్ అప్లికేషన్ గురించి ఇప్పుడిప్పుడే ప్రచారం అవుతోంది. ఇప్పటి వరకు 3వేల మందికి పైగా ఈ అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. గతేడాది 3వేల కుటుంబాల నుంచి 4లక్షల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ ఏడాది లక్ష నుంచి 2లక్షల కుటుంబాలకు చేరువై 50లక్షల కిలోల వ్యర్థాలను సేకరించాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.