తెలంగాణ

telangana

ETV Bharat / state

సాఫ్ట్‌వేర్‌ సంస్థ సీఈవో కిడ్నాప్‌ - 5 గంటల్లో ఛేదించిన జూబ్లీహిల్స్ పోలీసులు - Software company CEO kidnapped

Software Company CEO kidnapped : హైదరాబాద్​లో ఓ సాఫ్ట్​వేర్ సంస్థ సీఈవో కిడ్నాప్​ కేసును​ పోలీసులు 5 గంటల్లో ఛేదించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఒంగూరులోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి బంధించిన అతడిని పోలీసులు సురక్షితంగా కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

kidnapping case
kidnapping case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 9:32 AM IST

Software Company CEO kidnapped In Hyderabad : ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సీఈవో కిడ్నాప్ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. కిడ్నాప్ ఫిర్యాదు అందిన 5 గంటల్లోనే జూబ్లీహిల్స్‌ పోలీసులు బాధితుడిని గుర్తించారు. కిడ్నాప్ చేసిన నిందితులను అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాకటి రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి జూబ్లీహిల్స్‌లోని హుడా ఎన్‌క్లేవ్‌ నందగిరిహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. రాయదుర్గం టీ-హబ్‌ సమీపంలోని ఆర్బిట్‌మాల్‌లో ‘గిగ్లైజ్‌’ పేరుతో గత నవంబరులో సాఫ్ట్‌వేర్‌ సంస్థ ప్రారంభించాడు.

కన్సల్టెన్సీల ద్వారా 1500 మంది ఉద్యోగులకు శిక్షణనిచ్చి, దశల వారీగా ఉద్యోగాల్లోకి తీసుకున్నాడు. ఉద్యోగులకు కొద్ది నెలల పాటు జీతాలు చెల్లించినా, జనవరి నుంచి జీతాలు చెల్లించడం లేదు. దీంతో 8 మంది కన్సల్టింగ్‌ సిబ్బంది ఈ నెల 9న అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రవిచంద్రారెడ్డి ఇంటికి వచ్చారు. అతనితో జీతం విషయమై మాట్లాడారు. అనంతరం రవిచంద్రారెడ్డితో పాటుగా అతని స్నేహితుడైన మోహన్‌ను బలవంతంగా కార్లలో తీసుకెళ్లారు. నగరంలో పలు ప్రాంతాలు తిప్పారు. చివరకు నాగర్‌కర్నూల్‌ జిల్లా ఒంగూరులోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి బంధించారు.

హైదరాబాద్​ వ్యాపారవేత్త కిడ్నాప్ కేసు - చాకచక్యంగా ఛేదించిన పోలీసులు - HYDERABAD BUSINESSMAN KIDNAP CASE

రవిచంద్రారెడ్డి స్నేహితుడు మోహన్‌ అంతకుముందే మూత్ర విసర్జన పేరుతో కారులోంచి దిగి పారిపోయాడు. కుమారుడు తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన రవిచంద్రారెడ్డి తల్లి వాకటి మాధవి గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు రాత్రి 10 గంటల ప్రాంతంలో నిందితులున్న ప్రాంతాన్ని గుర్తించారు. వారందరినీ అదుపులోకి తీసుకొని గురువారం అర్ధరాత్రికి పోలీస్ స్టేషన్​కు తీసుకువచ్చారు. వాళ్లతో పాటుగా తీసుకెళ్లిన 82 ల్యాప్‌టాప్‌లను, ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

మా నుంచి రూ.15 కోట్లు వసూలు చేశారు : విషయం తెలుసుకున్న గిగ్లైజ్‌ సంస్థ ఉద్యోగులు శుక్రవారం పెద్దఎత్తున పోలీస్​స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఉద్యోగాల పేరుతో దాదాపు రూ.15 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఇటీవల ఎంపీ ఎన్నికల్లో రవిచంద్రారెడ్డి విజయవాడ నుంచి లిబరేషన్‌ కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచి మధ్యలోనే వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. అతని సోదరి చాందిని రెడ్డి ఇదే పార్టీ నుంచి నంద్యాలలో బరిలో నిలిచారని పేర్కొన్నారు. తమ డబ్బులతో ఎన్నికల బరిలో నిలిచారని బాధితులు తెలిపారు. ఈ అంశంపై రాయదుర్గం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయాలని వారికి జూబ్లీహిల్స్‌ పోలీసులు సూచించారు. ఇదిలా ఉండగా నియామకాలు చేసుకున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వని కారణంగానే మాట్లాడటానికి తీసుకెళ్లామని అరెస్ట్ అయిన కన్సల్టింగ్ కంపెనీ ఉద్యోగులు పోలీసులతో చెప్పారు.

వ్యాపారిని కిడ్నాప్ చేసి షేర్ల బదలాయింపు కేసు - రాధాకిషన్​రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు - PT Warrant on Radha kishan Rao

ABOUT THE AUTHOR

...view details