Hyderabad CP Srinivas Reddy on Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని హైదరాబాద్ సీపీ కొత్తకొట శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కోసం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని ఆయన వెల్లడించారు. కొందరు ఊహాగానాలతో దర్యాప్తు బృందాన్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి వివరాలను వెల్లడించలేమని తెలిపారు. అవసరమైన సమయంలో మీడియాకు అన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తుందని, కేసు విచారణ తర్వాత వారి వివరాలు వెలుగులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును మేం సీరియస్‌గా తీసుకున్నాం. మా దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ జరిపిన తర్వాత అందరి పేర్లు వెల్లడిస్తాం. కొందరు అనవసర వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇది సరైంది కాదు. - కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ సీపీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొందరి ప్రమేయం - త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి : హైదరాబాద్ సీపీ ఇదీ జరిగింది : ఎస్ఐబీ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. గత శానసనభ ఎన్నికల ఫలితాలు వచ్చిన మర్నాడే డీఎస్పీ ప్రణీత్‌రావు ఎస్ఐబీ కార్యాలయంలోని హార్డ్‌డిస్కులు ధ్వంసం చేసి మూసీలో పడేయటం, ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రిని మాయం చేసినట్లు గుర్తించిన అధికారులు, ఈ అభియోగాలపై కేసులు పెట్టి దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రణీణ్ రావు ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు, ఈ బండారం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే ఆధారాలు ధ్వసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు లేటెస్ట్ అప్డేట్ - ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్! - ఇదంతా ఎవరి కోసం? - Telangana Phone Tapping Case
ఇవే అభియోగాలపై ఇప్పటి వరకు నలుగురు పోలీస్ అధికారులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఐబీకి నేతృత్వం వహించిన ప్రభాకర్ రావు ప్రభుత్వం మారిన వెంటనే రాజీనామా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే అమెరికా వెళ్లిపోయారు. ఆయన ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. కానీ ఇప్పటి వరకు ఎఫ్.ఐ.ఆర్.లో ఆయన పేరు చేర్చలేదు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన పేరు కేసులో చేర్చి, అవసరమైతే అరెస్టు చేయాలన్నది పోలీసుల ఆలోచనగా భావిస్తున్నారు.
ఎన్నికలయ్యే వరకు బ్రేక్! : ఇదిలా ఉంటే మొదటి దశ దర్యాప్తు పూర్తయ్యేసరికి రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. దాంతో పోలీసులు కూడా ఎన్నికల విధుల్లో తలమునకలవుతున్నారు. దాంతోపాటు ఇక మీదట జరిగే దర్యాప్తు అంతా రాజకీయ నాయకుల చుట్టూనే తిరిగే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో నాయకులను విచారణకు పిలిపిస్తే రాజకీయ దుమారం రేగే అవకాశం ఉంది. దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలోనూ ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతానికి ఈ దర్యాప్తునకు కొంత విరామం ఇచ్చి, ఎన్నికలు పూర్తయిన తర్వాత తిరిగి మొదలు పెట్టాలన్నది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు - TELANGANA PHONE TAPPING CASE
ఫోన్ ట్యాపింగ్ కేసు - విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్‌రావును విచారించిన పోలీసులు - Telangana Phone Tapping Case