Hyderabad Book Fair 2024 : పుస్తక ప్రియులకు శుభవార్త. ప్రతి ఏటా మిమ్మల్ని అలరించి, విలువైన జ్ఞానాన్ని అందించి, తనదైన లోకంలో అనుభూతులను పంచే పుస్తక ప్రదర్శనశాల మళ్లీ వచ్చేసింది. ప్రతి ఏడాది హైదరాబాద్‌లో జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న ఈ బుక్ ఫెయిర్ 36వ ఎడిషన్‌తో ఈ సంవత్సరం కూడా మీ ముందుకొచ్చింది.
National Book Fair in Hyderabad 2024 :విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లుతున్న హైదరాబాద్ మహానగరంలో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. పది రోజుల పాటు ఈ బుక్ ఫెయిర్ కొనసాగనుంది. ఈ ప్రదర్శనను రాష్ట్ర సాంస్కృతి, పర్యాటక, అబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. శని, ఆదివారాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది వరకు తెరిచి ఉంటుంది.
365 స్టాళ్లు :ఈ బుక్ ఫెయిర్‌లో 365 స్టాల్స్ ఏర్పాటు చేశారు. పుస్తక ప్రదర్శనలో సాధారణ, ఇంగ్లీషుకు సంబంధించి 214, తెలుగు భాషకు సంబంధించి 115, స్టేషనరీ, హిందీ, ప్రభుత్వ, మీడియా స్టాల్స్ 36, రచయితలకు 6 స్టాల్స్ కేటాయించారు. జాతీయ స్థాయిలో చాలా మంది స్టాల్స్ ఏర్పాటు చేశారు. అన్ని భాషల పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉండనున్నాయి.
పుస్తకం తెరవాలంటే విసుగ్గా ఉందా.. ఈ చిట్కాలు మీ కోసమే
హైదరాబాద్ దోమలగూడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు (ఫిబ్రవరి 9) నుంచి 19వ తేదీ వరకు బుక్ ఫెయిర్ జరగనున్నట్లు హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్ తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరు పెట్టినట్లు చెప్పారు. ఈ వేదికకు సంస్కృత పండితులు రవ్వా శ్రీహరి పేరు, ద్వారానికి ఉర్దూ దినపత్రిక సియాసత్ మాజీ ఎండీ జహీరుద్దీన్ అలీ ఖాన్ పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ ఏడాది బుక్ ఫెయిర్‌లో వందకుపైగా పుస్తక ఆవిష్కరణలు జరగనున్నాయని వివరించారు.
"రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రాంగణం విశాలంగా ఉండేటట్లు రూపొందించాం. తాగునీటి సౌకర్యం, రుచికరమైన ఆహారంతో కూడిన ఫుడ్ స్టాల్స్ నోరూరించనున్నాయి. పిల్లలకు, ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు ప్రవేశం ఉచితం. సందర్శకుల ప్రవేశ రుసుం రూ.పది మాత్రమే. ప్రతి రోజూ రెండు నుంచి నాలుగు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పుస్తక ప్రియులు ఈ బుక్ ఫెయిర్‌ను సద్వినియోగ పరచుకోవాలి. ఎన్నో వేల పుస్తకాలు, మీకు నచ్చిన జానర్లు ఈ ఫెయిర్‌లో అందుబాటులో ఉంటాయి." - జూలూరి గౌరీ శంకర్, పుస్తక ప్రదర్శన శాల అధ్యక్షుడు
సాహిత్యంలో చిచ్చరపిడుగు- చిన్నవయసులోనే 4 పుస్తకాలు రాసిన అమ్మాయి
వేదాలను తెలుగులోకి అనువదించిన హైదరాబాద్ రచయిత.. 4వేల పేజీలు.. 28 కిలోల బరువు..