Husband And Wife die In Road Accident In Hyderabad : ఓ యువకుడి మద్యం మత్తు భార్యాభర్తల మృతికి కారణమైంది. వారి ఇద్దరు ఆడ పిల్లలను అనాథలుగా మార్చింది. ఎదుగుతున్న వయసులో తోడుగా ఉండాల్సిన తల్లిదండ్రులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. తాము పైలట్ కావాలని అమ్మానాన్న కన్న కలలు కల్లలయ్యాయని చిన్నారులు విలపించిన తీరు అందరి మనసులను కలిచివేసింది. కంటతడి పెట్టించింది.
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి :హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. వేగంగా వచ్చిన కారు మూడు ద్విచక్ర వాహనాలతో పాటు ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న దంపతులకు తీవ్రగాయాలై భార్య మోనా ఠాకూర్ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త దినేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వీరిద్దరూ ఐటీ ఉద్యోగులుగా చేస్తుండగా, వీరికి ఇద్దరు కుమార్తెలు ప్రేరణ శ్రీ, ధృతి శ్రీ ఉన్నారు. లంగర్‌హౌజ్ నుంచి బంజారాహిల్స్‌లోని దినేశ్ అత్తగారింటికి దంపతులిద్దరూ వెళ్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో నలుగురు గాయాలతో బయటపడ్డారు.
అయితే గోవా వెళ్లిన దినేశ్ కుటుంబం శనివారం రాత్రే హైదరాబాద్‌కు వచ్చింది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని దినేశ్ భార్యతో కలిసి బంజారాహిల్స్‌లోని అత్తగారింటికి బయల్దేరిన 10 నిమిషాలకే చేదువార్త వినాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతి చెందిన మోనా ఠాకూర్ ప్రస్తుతం గర్భవతిగా ఉందని వెల్లడించారు. అమ్మానాన్న లేరనే విషయాన్ని తట్టుకోలేకపోతున్నామని, తాము పైలట్ కావాలనే వారి కల కలగానే మిగిలిపోయిందని మృతుల పిల్లలు విలపించారు.