Real Estate Latest Updates : స్థిరమైన ఆదాయం కోసం గృహాలు కొనుగోలు చేసి చాలా మంది అద్దెకు ఇస్తుంటారు. అలాగే వాణిజ్య, రిటైల్ స్పేస్‌ను కొని లీజ్ ద్వారా నెలవారీగా ఆదాయం సంపాదిస్తుంటారు. కానీ ఈ రెండింటిలోనూ పెట్టుబడి పెట్టేందుకు అధిక మొత్తంలో డబ్బు కావాలి. అయితే వీటిలో ఆస్తులపై పూర్తి యాజమాన్య హక్కులు ఉంటాయి. ఈ రెండింటికీ భిన్నంగా ఇటీవల కాలంలో మాల్స్, వాణిజ్య భవనాల్లో కొద్ది మొత్తంతోనే పాక్షిక యాజమాన్య హక్కులతో రిటైల్ స్పేస్‌లో వాటా ఇస్తున్నారు. వీటి చట్టబద్ధతపై కొనుగోలుదారుల్లో సందేహాలు ఉన్నప్పటికీ రాబడి మెరుగ్గా ఉంటుందనే ప్రచారంతో ఆకర్షితులు అవుతున్నారు.
ఇందులో రూ.లక్షలు లేనిదే పెట్టుబడి పెట్టలేం.. అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా వందలు, వేలు రూపాయలతోనే రియాల్టీలో పెట్టుబడులకు రీట్స్(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) అవకాశం కల్పిస్తోంది. ఇవి మాత్రం మ్యూచువల్ ఫండ్ల మాదిరిగా పని చేస్తాయని తెలిపింది. చేతిలో సొమ్ము ఉన్నప్పుడు యూనిట్ల వారీగా కొనుగోలు చేయవచ్చని ఇండియన్ రీట్స్ అసోసియేషన్ పేర్కొంది. ఇవి పూర్తిగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పర్యవేక్షణలోనే పని చేస్తాయని, పూర్తి పారదర్శకత అని చెప్పింది.
పెట్టుబడులు పెట్టి మంచి రాబడులు కోసం అనువైన మార్గాలను మదుపర్లు ఎప్పటికప్పుడు అన్వేసిస్తుంటారు. అందులో మార్కెట్ల పరిస్థితులను బట్టి కాలానుగుణంగా షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఎఫ్డీలు, బంగారం, బాండ్లు, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఈ క్రమంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో స్థిరాస్తి రంగంపై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే ఇందులో తక్కువ మొత్తంతో వాణిజ్య స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు రీట్స్ అవకాశం కల్పిస్తున్నాయి.
ఇందులో రూ.100 నుంచే మదుపు చేయవచ్చు.. దీంతో కొత్తతరం మదుపర్లను బాగా ఆకర్షిస్తోంది. దీంతో నేరుగా స్థిరాస్తులను కొనుగోలు చేయకుండా, ఆదాయంలో వాటాను సంపాదించడానికి రీట్స్ అవకాశం కల్పిస్తోంది. నేరుగా స్థిరాస్తులను కొనుగోలు చేయకుండా, ఆదాయంలో వాటాను సంపాదించుకోవడానికి రీట్స్ అవకాశం ఇస్తోంది. మన దేశంలో మొట్టమొదటగా 2019లో ఎంబసీ రీట్ లిస్ట్ అయింది. ఆ తర్వాత 2020లో మైండ్ స్పేస్ రీట్, 2021లో బ్రూక్ ఫీల్డ్ రీట్, 2023లో మొదటి మాల్ రీట్స్ నెక్సెస్ లిస్ట్ అయ్యాయి. ఇప్పటివరకు మార్కెట్లో నాలుగు రీట్స్ లిస్ట్ అయ్యాయి.