Huge Number of RTC Buses to CM Jagan Siddham Meeting :మేదరమెట్ల సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులను అధికారులు తరలించడం ప్రయాణికులకు కష్టాలు తెచ్చిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 500కు పైగా బస్సులను సిద్ధం సభకు తరలించడంతో ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో గంటల తరబడి నిరీక్షించినా బస్సులు రాలేదు. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, కార్యాలయాలకు వెళ్లే వారు బస్సులు రాక ఇబ్బందిపడ్డారు. అధికారులు కనీసం సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా చోట్ల ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించిన జనం రాజకీయ సభలకు ప్రయాణికుల బస్సులను వాడుకునే సంప్రదాయం ఏంటని ప్రశ్నించారు.
బస్సుల కొరత : గుంటూరు జిల్లా నుంచి భారీగా బస్సులను సిద్ధం సభకు తరలించారు. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో బస్సులు లేక ప్రాంగణాలు వెలవెలబోయాయి. గుంటూరు, నరసరావుపేట, తెనాలి, పొన్నూరు, పర్చూరు, పిడుగురాళ్ల, మాచర్ల, వినుకొండ ప్రాంతాలకు వెళ్లేందుకు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. చిలకలూరిపేట నుంచి సిద్ధం సభ జరుగుతున్న మేదరమెట్ల వైపు బస్సులను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. చీరాల మీదుగా దారి మళ్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు మార్గమధ్యలో బస్సులు దిగి గమ్యస్థానాలకు ప్రైవేటు వాహనాల్లో వెళ్లిపోయారు. మంగళగిరి డిపోలో 23 బస్సులు ఉంటే వాటన్నింటినీ సిద్ధం సభకు తరలించారు.
బీఆర్ఎస్తో పొత్తుకు మాయావతి అంగీకారం - త్వరలో కేసీఆర్‌తో తదుపరి చర్చలు
సత్తెనపల్లిలో డిపోలో 45 బస్సులకు గాను 25 వాహనాలను సిద్ధం : సత్తెనపల్లిలో డిపోలో 45 బస్సులకు గాను 25 వాహనాలను సిద్ధం సభలకు తరలించారు. గ్రామాలకు వెళ్లాల్సిన ప్రజలు ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని గమనించిన మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్నారు. ఆటోలు ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు పంపారు. చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో మొత్తం 96 బస్సులు ఉండగా 80 బస్సులను సభకు పంపారు. చాలా సేపు బస్టాండ్‌లో వేచి ఉన్న జనం బస్సులు ఏవని అధికారులను నిలదీశారు. జగన్‌ను అడగాలని వారు దురుసుగా సమాధానం ఇచ్చారని ప్రయాణికులు వాపోయారు. ప్రకాశం జిల్లా కనిగిరి డిపో నుంచి 48 బస్సులను సిద్ధం సభకు తరలించారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ఎండలో ఆటోల కోసం నిరీక్షించారు. మార్కాపురం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే వారు ప్రైవేటు వాహనాల్లో వెళ్లిపోయారు.