Projects Gates Opened in Telangana :భారీ వర్షాలతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు అన్నీ నిండిపోయాయి. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి 40 గేట్ల ద్వారా లక్షన్నర క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో 1088.8 అడుగుల వరద నీరు ఉంది. భారీ వర్షాల కారణంగా గోదావరి తీరం వైపు, ప్రాజెక్టు వైపు ప్రజలు ఎవరు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత లక్షకు పైగా క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో ఆ మేర దిగువకు నీటిని విడుదల చేశారు.
భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుబీర్‌లో విటలేశ్వరుని ఆలయంలో భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. కడెం, గడ్డెన్న వాగు నుంచి వరద రావడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా 18 టీఎంసీలకు నీటిమట్టం చేరింది. నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద చేరుతుండటంతో 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 5 లక్షల క్యూసెక్కులకుపైగా నీరు వస్తుండగా గేట్లను ఎత్తి స్పిల్ వే ద్వారా 5 లక్షల పైచిలుకు క్యూసెక్కుల వరద దిగువకు వదులుతున్నారు.
ప్రమాదకరంగా ఉరకలు వేస్తున్న కృష్ణమ్మ :నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం 587.10 అడుగులుగా ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టులకు వరద కొనసాగుతుంది. ఆదివారం కురిసిన వర్షానికి శంకర సముద్రం, సరళ సాగర్ రామన్‌పాడు, కోయిల్ సాగర్ జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వరద నీరు పోటెత్తడంతో రెండో రోజు కూడా ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగింది. దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ జలాశయం నుంచి నాలుగు గేట్ల ద్వారా 12 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.