Suryapet Flood Damage : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లాలో సుమారు రూ.75 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. జీవితంలో ఎప్పుడూ చూడని ప్రకృతి విలయంతో, వాకిలి, గొడ్డూ, గోదా, దాచుకున్న డబ్బు, నిల్వ చేసుకున్న తిండి గింజలు, ఆరు గాలం శ్రమించి పండించిన పంట ఒకటేమిటి సర్వస్వం ఒక్క వరదతో గంటల వ్యవధిలో కోల్పోయిన పరిస్థితి నెలకొంది.
వరద నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లాలో ఇటీవల కేంద్ర బృందం పర్యటించింది. వీరితో పాటు జిల్లాలోని అధికారులు కూడా వరద బాధితుల నుంచి వివరాలు సేకరించారు. వరదల వల్ల సుమారు రూ.75 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టంపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపినట్టు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో 33 శాతం కన్నా ఎక్కువ పంట నష్టం జరిగిందని 9 వేల 68 హెక్టార్లలో రూ.14.43 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. కోదాడ మునిసిపాలిటీ పరిధిలో ఇద్దరు ప్రమాదవశాత్తు వరదల్లో మృతి చెందారు. వారికి ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించారు. వరదల వల్ల నష్టపోయిన ఇంటికి రూ.16 వేల 500 చొప్పున రూ.8.16 కోట్లు పరిహారం అందించేలా అధికారులు లెక్కలు కట్టారు.
నీట మునిగిన పంటలు, నేలకొరిగిన తోటలు - చేతికందే పరిస్థితి లేదంటున్న అన్నదాతలు - Crop Loss In Telangana
రోడ్ల మరమ్మతులకు రూ.4.26 కోట్లు : జిల్లాలో దెబ్బతిన్న 126 రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.7.21 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేయగా వీటితో పాటు 61 కల్వర్టులు, వంతెనలు మరమ్మతులకు రూ.36.60 లక్షలు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. రోడ్లు, భవనాల శాఖలో 231.90 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని వాటి మర్మతులకు రూ.1.39కోట్ల గ్రామీణ రహదారులు 7.10 కిలోమీటర్లు దెబ్బతిన్నాయని వాటి మరమ్మతులకు రూ.4.26కోట్లు అవసరం కానున్నాయి. కోదాడ, హుజూర్ నగర్ గ్రామీణ ప్రాంతాలలో వీటి ప్రభావం అధికంగా ఉంది. మేళ్లచెరువు-కోదాడ రహదారిలో కందిబండ వంతెన కూలిపోవడంతో నాలుగైదు మండలాలకు వెళ్లే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.24.30కోట్లు :వరదల కారణంగా 4,461 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని వాటి ఏర్పాటుకు రూ.2.23 కోట్ల అవసరం కానున్నాయి. జిల్లాలో నాలుగు ప్రాథమిక పాఠశాలలు, ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు కేజీబీవీ , ఎమ్‌ఆర్సీ భవనం, ఒక సాంఘిక సంక్షేమ వసతిగృహం, 4 గిరిజన సంక్షేమ వసతి గృహాలు దెబ్బతిన్నాయి. వీటితో పాటు 40 చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు, 13 పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని వాటికి మరమ్మతులకు రూ.24.30 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. జిల్లాలో వరదల కారణంగా జరిగిన అన్ని విభాగాలకు సంబంధించిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి అధికారులు నివేదికలు పంపారు. సర్కారు నుంచి పరిహారం కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు.
పొలాల్లో ఇసుక దిబ్బలు, రాళ్లు, రప్పలు - అతలాకుతలమైన రైతుల పరిస్థితి - Floods Damage in Telangana
రైతు కడుపు కొట్టిన వానలు - వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు - HUGE CROP DAMAGE IN TELANGANA