Students and Youth Suicides :ఈతరం పిల్లలు తల్లిదండ్రులు మందలించారనో.. వారు కావాలనుకున్నది కొనివ్వలేదనో.. పరీక్షల్లో మంచి మార్కులు రాలేదనో.. ప్రేమించిన మనిషి మోసం చేసిందనో.. భార్యభర్తల కలహాల వల్ల కాస్త ఆలోచించకుండా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయి. రేపటి భావిభారత పౌరులేనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే భయం అందరిలో కలుగుతోంది. ఒక సమస్యను ఫేస్ చేయకుండా మానసిక ఒత్తిడికి నేటి తరం యువత గురవుతున్నారనే విషయం ఈ ఘటనల చూస్తున్న తర్వాత అర్థమవుతోంది. చిన్నచిన్న కారణాలతో క్షణికావేశంలో ఎంతో విలువైన జీవితాలను మధ్యలోనే అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. మరి ఇలాంటి సమస్యల నుంచి వారిని గట్టెక్కించేదేలా? తల్లిదండ్రుల ప్రభావం వారిపై ఏ మేరకు ఉంటుంది? అసలు మానసిక నిపుణులు ఏం అంటున్నారో తెలుసుకుందాం.
ఉద్రేకం, ఆందోళన, ఒత్తిడి, భయం.. ఇలా కారణం ఏదైనా కొన్నేళ్లుగా కౌమార దశ, యుక్తవయసుల వారు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోయాయి. వారిపై కుటుంబ సమస్యలు, చదువులో వెనుకబాటు, సరైన సంరక్షణ లేకపోవడం, ప్రేమ విఫలం, గంజాయి, మద్యం, డ్రగ్స్ ఇలాంటివి వారిని ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కౌమార దశలోనే ఇలాంటి మానసిక సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో వారిపై పెనుప్రభావమే చూపుతాయని అంటున్నారు.
వివాహమైన తర్వాత కుటుంబంతో సంతృప్తికర జీవితం గడపడానికి వీలుకాని రీతిలో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని తెలుపుతున్నారు. ఇలాంటివి ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి సరైన చికిత్స చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు ప్రేమగా మాట్లాడటంతో పాటు మానసిక నిపుణుల చేత కౌన్సిలింగ్ ఇస్తే సాధారణ స్థితికి వస్తారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.