తెలంగాణ

telangana

ETV Bharat / state

అలర్ట్ : మీరు తాగే పాలలో సబ్బు నీళ్లు, యూరియా గుళికలు! - కల్తీని ఇలా ఈజీగా కనిపెట్టండి - HOW TO FIND ADULTERATED MILK

కల్తీ పాలు తాగుతున్నారేమో ఓసారి చెక్‌ చేసుకోండి - సింపుల్‌ టిప్స్‌తో మీరు కొన్న పాలు కల్తీవా లేదా మంచివా అని గుర్తించండి

How to Find Adulterated Milk
How to Find Adulterated Milk (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2024, 5:30 PM IST

How to Find Adulterated Milk : ఉదయం నిద్ర మేల్కొన్న వెంటనే టీ తాగకపోతే కొంతమందికి ఆరోజే గడవనట్లుగా ఉంటుంది. చిన్న పిల్లలకు పాలు, అన్నంలోకి పెరుగు, మజ్జిగ తయారీకి మిల్క్ నిత్యావసరంగా మారాయి. ఇటువంటి పాలను కొంతమంది ప్రబుద్ధులు కల్తీ చేస్తున్నారు. గతంలో చిక్కని పాలల్లో కొంచెం నీళ్లు కలిపేవారు. కానీ ఇప్పుడు ఏకంగా నకిలీ పాలనే తయారు చేస్తున్నారు. కొందరైతే విషపూరిత డిటర్జెంట్, యూరియా లాంటివి కలుపుతున్నారు. పాల కల్తీపై పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి. నమ్మకమైన వ్యక్తుల లేదా సంస్థల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని, అనుమానం వస్తే పరీక్షించి చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

పాలను ఎలా కల్తీ చేస్తున్నారంటే? : పాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే కొంతమంది ప్రబుద్ధులు కల్తీకి పాల్పడుతున్నారు. పరిశుభ్రం కాని నీరు కలపడంతో పాటు విషపూరిత రసాయనాలు వాటిలో మిళితం చేస్తున్నారు. కొన్ని రకాల పొడులు, నురగ వచ్చేలా సబ్బు పొడి, తెల్లదనం కోసం యూరియాను కలుపుతున్నట్లు గతంలో పోలీసులు గుర్తించారు. కల్తీ పాలను వినియోగిస్తే అనారోగ్యంతో పాటు దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మిల్క్‌ కల్తీని గుర్తించే పద్ధతులు :

  1. నీళ్లను కలిపిన పాలు : ఓ చుక్క మిల్క్‌ను నున్నని, ఏటవాలు ప్రదేశంలో ఉంచినప్పుడు స్వచ్ఛమైనవి నెమ్మదిగా కదులుతూ అవి జారిన తలంపై తెల్లని మచ్చ ఏర్పడుతుంది. నీళ్లు కలిసిన పాలు ఐతే త్వరగా ప్రవహించి, ఎటువంటి మచ్చ జాడ కనిపించదు.
  2. పిండి పదార్థాలతో కల్తీ : పాలల్లో కొన్ని చుక్కల అయోడిన్‌ ద్రావణాన్ని కలిపినప్పుడు నీలి రంగుకు మారినట్లయితే పిండి పదార్థాల కల్తీ జరిగినట్లు.
  3. యూరియా కలిపితే : టీస్పూను మిల్క్‌కు ఆఫ్ టేబుల్‌ స్పూన్‌ సోయాబీన్‌ పిండిని కలిపి మిశ్రమాన్ని బాగా కలియదిప్పి 5 నిమిషాల తరువాత ఆ పాలలో రెడ్‌ లిట్మస్‌ కాగితాన్ని ముంచితే నీలి రంగుకు మారుతుంది. లిట్మస్‌ పేపర్లు అన్ని మందుల దుకాణాల్లో లభ్యమవుతాయి.
  4. డిటర్జెంట్ కల్తీ : 5 మిల్లీలీటర్ల పాలు, 5 మిలీ నీళ్లు కలిపి బాగా కలిపి తిప్పితే నురగ ఏర్పడితే డిటర్జెంట్ కల్తీ జరిగినట్లు లెక్క.
  5. కృత్రిమ పాలు : ఈ కృత్రిమ పాలు చేదు రుచి కలిగి, వేళ్ల మధ్యలో తీసుకొని రుద్దినప్పుడు సబ్బు వంటి భావన కలుగుతుంది. వేడి చేసినప్పుడు పసుపు రంగులోకి మారతాయి. కృత్రిమ పాల తయారీకి నీళ్లు, రంగులు, తక్కువ ధర నూనెల, క్షార ద్రావణాలు, యూరియా, డిటర్జెంట్లు వాడతారు.

"పాల కల్తీ వల్ల ప్రజారోగ్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది. సరైన పోషకాలు అందకపోతే చిన్న పిల్లల్లో ఎదుగుదల, మానసిక వికాసం జరగదు. పాల కల్తీ అనేది నేరం. అప్రమత్తంగా ఉంటూ, ప్రజలు చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుని కల్తీ వినియోగాన్ని అడ్డుకోవచ్చు"-లగడపాటి వెంకటేశ్వరరావు, విశ్రాంత మేనేజరు, డెయిరీ టెక్నాలజిస్టు

రోజూ పాలు తాగితే చెడు కొలెస్ట్రాల్​ తగ్గుతుందా? నివేదికలు ఏం చెబుతున్నాయంటే?

పాలు తాగాక ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - అయితే ఈ ఆరోగ్య సమస్యలు రావడం పక్కా!

ABOUT THE AUTHOR

...view details