How To Choose Flots in Skyscrapers in Hyderabad City : హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ఆకాశహర్మ్యాలు దర్శనం ఇస్తున్నాయి. నగరంలో వేరు వేరు దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వచ్చే సంవత్సరం మరిన్ని నూతన ప్రదేశాల్లో ఈ తరహా ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు నిర్మాణ సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయి. కొన్ని సంస్థలు పనులు మొదలు పెట్టేందుకు అనుమతులతో సిద్ధంగా ఉన్నాయి. నగరంలోని కోకాపేటలో 57 అంతస్తుల నిర్మాణం చివరి దశలో ఉంది. కొత్త సంవత్సరంలో మరో సంస్థ 65 అంతస్తుల టవర్ నిర్మించేందుకు సిద్ధంగా ఉంది. చాలా మంది ఎత్తైన భవనాల్లో ఉండాలని కలలు కంటూ దాన్ని నిజం చేసుకుంటున్నారు. వీటిలో కొనుగోలు చేసేముందు ఏయే అంశాలు చూడాలో ఇప్పుడు చూద్దాం.
దేశంలో ముంబయి తరువాత పెద్ద సంఖ్యలో టవర్లను కడుతున్నది హైదరాబాద్ నగరంలోనే. కోకాపేట, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్లలోనే కాదు, నగరం నలువైపుల వీటి నిర్మాణం చేపడుతున్నారు. పశ్చిమ హైదరాబాద్ ప్రాంతంలో నిర్మించే పలు భవనాలు 50 అంతస్తుల్లో ఉంటే, తూర్పు, ఉత్తరం, దక్షిణ ప్రాంతాల్లో 30 నుంచి 40 అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు.
ఎకరాలో 90 నుంచి 120 ఫ్లాట్లు ఉంటే సౌకర్యం! :ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులు అన్నీ నాలుగు ఐదు ఎకరాలు మొదలు 30 ఎకరాల విస్తీర్ణంలో కడతారు. 70 శాతం జాగా ఖాళీ వదిలి నిర్మిస్తున్నామని నిర్మాణ సంస్థలు అంటున్నాయి. ఇందు కోసం మరింత పైకి వెళుతున్నారు. ప్రాజెక్టు లాభసాటిగా ఉండేందుకు ఒక్కో ఫ్లాట్‌ని 3 వేల నుంచి 8 వేల చ.అ.విస్తీర్ణం ఉండేలా కడుతున్నారు. ఎకరాలో గరిష్ఠంగా 180 నుంచి 200 ఫ్లాట్ల వరకు నిర్మిస్తున్న బిల్డర్లు ఉన్నారు. అధిక సంఖ్యలో కట్టడం ద్వారా ధరలో వ్యత్యాసం, అదే టైంలో కమ్యూనిటీలో నివాసితుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎకరాలో 90 నుంచి 120 వరకు నిర్మాణం చేపడితే సౌకర్యంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నారు. ఆ మేరకు ధర కూడా ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి.
క్లబ్ హౌస్ ఎంత విస్తీర్ణంలో ఉండాలి? : గేటెడ్ కమ్యూనిటీల్లో క్లబ్ హౌస్‌లో కల్పించే సౌకర్యాల గురించి అధికంగా నిర్మాణ సంస్థలు ప్రచారం సాధారణంగా చేస్తుంటాయి. అక్కడ స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, బాంక్వెట్ హాల్స్, క్రీడా మైదానాలు, పిల్లల కోసం క్రెచ్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. ఫ్లాట్ల సంఖ్యతో పోలిస్తే క్లబ్ హౌస్‌లో కల్పించే సౌకర్యాలు సరిపోతాయా లేదా అనేది కూడా కొనుగోలు చేసే ముందు చూసుకోవాలి. 1000 ఫ్లాట్లు ఉన్నాయంటే కనీసంగా 50 వేల విస్తీర్ణం కలిగిన క్లబ్ హౌస్ సదుపాయాలు ఉండాలని బిల్డర్లు అంటున్నారు. ప్రస్తుతం చాలా ప్రాజెక్టుల్లో నివాసితులకు తగిన నిష్పత్తిలో సౌకర్యాలు ఉండటం లేదు. ఒకేసారి ఎక్కువ మంది ఆడుకునేందుకు వస్తే ఆట స్థలం చాలడం లేదనే ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి.
బాల్కనీ వ్యూ ఎటువైపు ఉంటే మంచిది? : టవర్లలో ఫ్లాట్ కొనుగోలు చేసే వారిలో బాల్కనీ వ్యూ ఎటు వైపు ఉండాలి అనేది చాలా మంది సందేహం. నిర్మాణం పూర్తయిన ఇంట్లో చేరాక, ఆ పక్కనే మరోక ఆకాశహర్మ్యం రావడంతో బాల్కనీ వ్యూ లేకుండా పోయిందని చాలా మంది అవేధన వ్యక్తం చేస్తున్నారు. పార్కులు, రోడ్డు వైపు ఎంపిక చేసుకుంటే అక్కడ కట్టడాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉండదు. కమ్యూనిటీ లోపలి వైపు వ్యూ ఉండే బాల్కనీ అయితే ఆట స్థలాలు గార్డెనింగ్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఉంటాయి. ఎదురుగా ఉండే ఫ్లాట్లు, ప్రజల సందడి కన్పిస్తుంది. వారి వారి వ్యక్తిగత ఇష్టాఇష్టాలను అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు.