Medicover Docters Recreated Full Penis : సోమాలియాకు చెందిన ఓ యువకుడికి చిన్నతనంలో సున్తీ కారణంగా ఇన్‌ఫెక్షన్ సోకడంతో పురుషాంగాన్ని తొలగించారు. కానీ మెడికవర్ వైద్యులు ఆ యువకుడిని అరుదైన శస్త్రచికిత్సతో కోల్పోయిన పురుషాంగాన్ని పునరుద్ధరించారు. తొడ, పొట్ట ప్రాంతంలోని రక్తనాళాలు, మోచేతి నుంచి కండరాన్ని సేకరించడం ద్వారా పురుషాంగాన్ని మళ్లీ సృష్టించి విజయవంతంగా అమర్చారు. ఏడాదిన్నర క్రితం చేసిన ఈ సర్జరీతో యువకుడు పూర్తిగా కోలుకున్నాడు.
రెండు దశల్లో సర్జరీ : అంగ స్తంభన కోసం తాజాగా పినైల్ ఇంప్లాంట్ ఏర్పాటు చేసినట్లు వెద్యులు తెలిపారు. రెండు దశల్లో జరిగిన ఈ చికిత్స సక్సెస్ఫుల్ అయినట్లు గురువారం ఆసుపత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ రవికుమార్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దాసరి మధు వినయ్‌కుమార్‌లు మీడియాకు వివరించారు. సోమాలియా దేశానికి చెందిన 20 ఏళ్ల యువకుడికి నాలుగేళ్ల వయసులో సున్తీ జరిగినట్లు తెలిపారు.
ఇన్‌ఫెక్షన్ సోకడంతో వైద్యులు ఆ యువకుడి పురుషాంగాన్ని తొలగించారు. వృషణాల కింద నుంచి మూత్రం వెళ్లేలా వైద్యులు మార్గం ఏర్పాటు చేశారు. 18 ఏళ్ల వయస్సు వచ్చే నాటికి మూత్ర విసర్జనలో ఇబ్బందులు తలెత్తడంతో బాధితుడు మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రిని సంప్రదించాడు. ఈ నేపథ్యంలో ఇక్కడి వైద్యులు తొలుత మూత్ర విసర్జన సరిగా జరిగేలా ఓ సర్జరీ చేశారు. తర్వాత పురుషాంగాన్ని పునఃసృష్టించాలని నిర్ణయించారు.
మోచేయి ప్రాంతంలోని కండరాలతో : ఇందులో భాగంగా తొలుత రోగి మోచేయి వద్ద మైక్రోవాస్క్యులర్ సర్జరీ ద్వారా రేడియల్ ఆర్టెరీ ఫోర్‌ఆర్మ్ ఫ్లాప్ విధానంలో పురుషాంగాన్ని రూపొందించారు. అనంతరం రక్తనాళాలతో అనుసంధానం చేశారు. తర్వాత దాన్ని సర్జరీ చేసి వృషణాల పైభాగంలో అతికించారు. మూత్రవిసర్జన పురుషాంగం ద్వారా జరిగేలా ఓ గొట్టాన్ని ఏర్పాటుచేసి మూత్రాశయానికి నేరుగా అనుసంధానించారు.
ఏడాదిన్నర తర్వాత బాధితుడు స్పర్శ పొందగా అంగస్తంభన కోసం తాజాగా వైద్యులు పిలైన్ ఇంప్లాంట్‌ను అమర్చినట్లు వారు వివరించారు. ఇకపై బాధితుడు వివాహం చేసుకుని సంసార జీవితం కూడా గడపవచ్చని తెలిపారు. గతంలో ఇన్‌ఫెక్షన్ కారణంగా వీర్యగ్రంథి దెబ్బతిందని వెల్లడించారు. దీని వల్ల వీర్య ఉత్పత్తి మాత్రం జరగదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇలాంటి శస్త్రచికిత్స ఇదే మొదటిసారి అని చెప్పారు.