House Price Hike in Hyderabad : భాగ్య నగరంలో ఇళ్ల ధరలు అత్యధికంగా పెరిగాయని ఓ అధ్యయనం వెల్లడించింది. హైదరాబాద్‌లో గత నాలుగేళ్లలో 80 శాతం మేర ఇళ్ల ధరలు పెరిగాయని తెలిపింది. దేశవ్యాప్తంగా చూస్తే, స్థిరాస్తి ధరల్లో అత్యధిక పెరుగుదల ఇదేనని ‘మ్యాజిక్ బ్రిక్స్’ అనే రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సేవల సంస్థ తాజా అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 10 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలను పరిశీలించి వాటి ఆధారంగా, ఈ సంస్థ నివేదిక రూపొందించింది. ఇళ్ల ధరలు అనూహ్యంగా పెరిగినప్పటికీ, అదే స్థాయిలో ప్రజల ఆదాయాలు మాత్రం పెరగకపోవడంతో ఇంటి కొనుగోలు కోసం చేసిన రుణాలకు నెలవారీ కిస్తీల(ఈఎంఐ) భారం అధికమవుతోందని సంస్థ వివరించింది.
ఇళ్ల ధరల్లో 80శాతం పెరుగుదల :మ్యాజిక్‌బ్రిక్స్ అధ్యయనం ప్రకారం 2020- 24 మధ్య భారత్‌లోని 10 నగరాల్లో ప్రజల ఆదాయాల్లో వృద్ధిరేటు 5.4 శాతమే. అదే సమయంలో ఇళ్ల ధరలు 9.3% పెరిగాయి. దీని వల్ల ప్రజల ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గిందని అధ్యయనం చెబుతోంది. ఇళ్ల ధరలు హైదరాబాద్‌లో 80 శాతం పెరిగినట్లుగా నివేదిక వెల్లడించింది. ముంబయి, దిల్లీ నగరాల్లో ఇళ్ల ధరలు మధ్యతరగతి ప్రజలు భరించలేని స్థాయిలో ఉండగా, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాల్లో కొంత అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తున్నాయని నివేదిక తెలిపింది.
ఆదాయంలో 61శాతం ఈఎంఐలకే :నెలవారీ ఆదాయంలో ఇంటి లోన్ కోసం చెల్లిస్తున్న ఈఎంఐ వాటా, మనదేశంలో 2020లో సగటున 46% కాగా, 2024 నాటికి 61 శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది. అంటే ఇళ్ల కొనుగోలుదారులపై ఈఎంఐ భారం ఒక్కసారిగా పెరిగింది. నెలవారీ ఆదాయంలో కిస్తీలు(ఈఎంఐ) వాటా ముంబయిలో 116%, దిల్లీలో 82% ఉండగా హైదరాబాద్‌లో 61 శాతంగా ఉంది. అంటే ఈ నగరాల్లో ప్రజలు తమ కుటుంబ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని హోమ్‌లోన్ వాయిదా చెల్లించడానికే కేటాయిస్తున్నారు. అహ్మదాబాద్ - చెన్నై నగరాల్లో ఇది 41% ఉండగా కోల్‌కతాలో 47 శాతంగా ఉంది. అంటే ఇళ్ల ధరలు ఈ మూడు నగరాల్లో కొంత అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తోంది.