HMDA Ex Director Shiva Balakrishna Case Updates : రెరా డైరెక్టర్ శివబాలకృష్ణ హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా(RERA Secretary Shiva Balakrishna) ఉన్నప్పుడు తన కార్యాలయాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ దళారి ఆయనకు కుడిభుజంగా వ్యవరించినట్లు తెలుస్తోంది. ఏ ఫైళ్ల మీద సంతకం పెట్టాలన్నా పరిష్కారం చూపాలన్నా ఆ దళారి మాటే చెల్లుబాటు అయ్యేదని సమాచారం.
హైదరాబాద్ శివారుకు చెందిన తన మిత్రుడిని, కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తిని బినామీలుగా మార్చుకుని భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ వస్తుందనే తెలియగానే హైదరాబాద్ శివార్లు సహా పొరుగు జిల్లాలకు సంబంధించిన ఫైళ్లపై ఆగమేఘాల మీద సంతకాలు పూర్తిచేసి భారీగా ముడుపులు అందుకున్నట్టు తెలుస్తోంది. హెచ్‌ఎండీఏ నుంచి రెరాకు బదిలీ అయ్యే సమయంలో ప్రధాన ఫైళ్లన్నీ తన వెంట తీసుకెళ్లిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ దస్త్రాలతో బేరసారాలు సాగించినట్టు సమాచారం. కొద్ది సమయంలోనే సుమారు 500 దస్త్రాలపై సంతకాలు చేసినట్టు తెలుస్తోంది.
అవినీతి లంచావతారాల పీడ ఇంకెన్నాళ్లు - నిర్మూలన ఎలా ?
HMDA Shiva Balakrishna Arrested : బాలకృష్ణ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ సర్వే నెంబర్ 446లోని భూమి కోర్టు పరిధిలో ఉండగా వాటికి అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాలకృష్ణ గతంలో అనేక సార్లు బెదిరించారని సూర్యప్రకాశ్ అనే బాధితుడు తెలిపారు. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేసిన కాలంలో తీసుకున్న నిర్ణయాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు జీవో నెంబర్ 111 పరిధిలోని వట్టినాగులపల్లిలో కోట్లు విలువ చేసే స్థలాలకు భూవినియోగ మార్పిడి చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై దృష్టి పెట్టిన సర్కార్ శివబాలకృష్ణ ఆమోదించిన దస్త్రాలను పరిశీలించాలని భావిస్తోంది.