Highest Temperature in Telangana : భానుడి భగభగలతో రాష్ట్రంలోని పలుప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. గత పదిసంవత్సరాలలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. పది జిల్లాల్లోని 20 మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. అత్యధికంగా నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో 46.6 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఈ జిల్లాలోని పలు మండలాలు 46.5 డిగ్రీల ఎండతో అల్లాడాయి. దీంతో అక్కడి ప్రజలు బయటికి రావాలంటనే బయపడుతున్నారు. ఇది ఆందోళనకర పరిణామమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రాష్ట్రంలో సాధారణం కన్నా సగటున 2.1 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది మే నెలతో పోల్చితే ఏకంగా 7.5 డిగ్రీలకుపైగా పెరుగుదల కనిపిస్తోంది. ఉదాహరణకు జగిత్యాలలో గతేడాది ఇదే రోజున 35.6 డిగ్రీలు నమోదు కాగా బుధవారం 45.6 డిగ్రీలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలో 2 మండలాలతో పాటు ఖమ్మం నగరంలో వడగాలులు వీచినట్లు వాతావరణశాఖ పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ నెల 5వ తేదీ వరకు వడగాలుల ముప్పు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.
People Died Due to Heat Stroke :కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట బూడిగజంగాల కాలనీకి చెందిన దివ్యాంగ బాలుడు కల్లెం యశ్వంత్(5) బుధవారం మధ్యాహ్నం ఇంట్లో రేకుల వేడికి తాళలేక మృతిచెందాడు. జనగామ పట్టణంలోని గుండ్లగడ్డకు చెందిన మహ్మద్ మొహినొద్దీన్(52) కూలీ పనులు చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున ఇంట్లోనే కుప్పకూలి మృతిచెందారు. ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం పార్డి బి గ్రామ పంచాయతీ పరిధిలోని పర్పులపల్లెకు చెందిన ఆత్రం జంగు(48) పొలం పనులు చేసుకొని మధ్యాహ్నం ఇంటికి తిరిగి రాగానే ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మరణించారు.
రాష్ట్రంలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు - వడదెబ్బతో ముగ్గురు మృతి - Temperature Rises In Telangana