Highest Temperature in Nirmal :నిర్మల్ జిల్లా శనివారం నిప్పుల కొలిమిలా మండింది. ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు దంచి కొట్టాయి. రాష్ట్రంలోనే కుభీర్ మండల కేంద్రంలో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. నిర్మల్ గ్రామీణ జిల్లా ముజిగిలో 45.2, తానూరు మండల కేంద్రంలో 44.8 నమోదు కాగా కడెం పెద్దూరులో 44.7, బాసరలో 44.3 డిగ్రీల ఎండ కాసింది. కామారెడ్డి జిల్లా వర్ని మండలం జాకోరాలో 44.8, ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో 44.7, జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్‌లో 44.9, మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్‌లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి : ఈ నెల 24 నుంచి 25 ఉదయం వరకు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 4.8 సెం.మీ, మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో 4.6, నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనాగులలో 2 సెంటీ మీటర్ల వర్షం పడింది. వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట, కుమురం భీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. మరోవైపు రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.