తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చే అధికారం ప్రభుత్వానికి లేదు : హైకోర్టు - TELANGANA HC ON PRIVATE PROPERTY

ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చే అధికారం ప్రభుత్వానికి లేదన్న హైకోర్టు - మార్గదర్శకాలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు కావన్న ధర్మాసనం

Telangana HC On Private Property
Telangana HC On Private Property (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2025, 5:59 PM IST

Telangana HC On Private Property : ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చే అధికారం ప్రభుత్వానికిగానీ, అధికారులకుగానీ లేదని, దీనికి సంబంధించి చట్టం స్పష్టంగా ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఎ కింద అనుసరించాల్సిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చలేరని, మార్గదర్శకాలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు కావని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో 128 ఎకరాలను విక్రయించడానికిగాను ధరణి వెబ్ పోర్టల్లో స్లాట్ బుకింగ్​కు అవకాశం లేకుండా నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ బాచుపల్లికి చెందిన వెంకటసుబ్బయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సి.వి.భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ సాదా బైనామా కింద కొనుగోలు చేశారన్నారు. 1992లో చట్టప్రకారం క్రమబద్ధీకరించుకున్నారని దీనికి సంబంధించి పట్టా కూడా జారీ అయిందన్నారు.

అలా చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం :పెట్టుబడి రాయితీ కింద్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలు కూడా పొందారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ భూమిని విక్రయించడానికిగాను రిజిస్ట్రేషన్ ఫీజు తదితరాలు ఈ - చలానా కింద 30 లక్షలకు పైగా చెల్లించి విక్రయం కోసం స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే బ్లాక్ చేశారన్నారు. జుల్ఫికర్ అలీఖాన్ అనే వ్యక్తి ఇచ్చిన వినతి పత్రం ఆధారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ రిజిస్ట్రేషన్ కాకుండా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. సర్వే నెం 132, 133లో సాదాబైనామా కింద కొనుగోలు చేశాడని సీసీఎల్ఏకు చెప్పడంతో ఎలాంటి నోటీసు ఇవ్వకండా రిజిస్ట్రేషను నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

ఆ అధికారం ప్రభుత్వానికి, అధికారులకు లేదు :రిజిస్ట్రేషన్లు నిలిపిసే అధికారం సీపీఎల్ఏకు లేదని తెలిపారు. సెక్షన్ 22ఎ జాబితాలో ఉండటంగానీ లేదంటే కోర్టు ఉత్తర్వులుంటే తప్ప రిజిస్ట్రేషన్ ను అడ్డుకోరాదన్నారు. ఇరువైపుల వాదనలను విన్న న్యాయమూర్తి ప్రైవేటు పట్టా భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఎ కింద నిషేధిత జాబితాలో చేర్చే అదికారం ప్రభుత్వానికి, అధికారులకు లేదని చట్టం స్పష్టంగా చెబుతోందన్నారు.

రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22ఎలో పేర్కొన్న పరిధిలోని అంశాల్లోకి వస్తే తప్ప ప్రభుత్వానికి, అధికారులకు ప్రైవేట్ ఆస్తులుకు నిషేదిత జాబితాలో చేర్చే అధికారంలేదన్నారు. నిషేధిత జాబితాలోని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయరాదన్న మార్గదర్శకాలను రిజిస్ట్రేషన్ అధికారులు అమలు చేయాల్సి ఉందన్నారు. దీనికి విరుద్ధంగా చేపట్టిన ఎలాంటి చర్య అయినా చట్ట విరుద్ధమేనని అది చెల్లదన్నారు. అందువల్ల పిటిషనర్​కు చెందిన పత్రాలను పరిశీలించి నిబంధనల ప్రకారం ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉత్తర్వుల కాఫీ అందిన 4 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తూ విచారణను మూసివేశారు.

గేటెడ్ కమ్యూనిటీల్లో ఏం చేయాలి - ఏం చేయకూడదో స్పష్టంగా చెప్పండి : హైకోర్టు

హైదరాబాద్‌ నగరంలోని చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే : హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details