High Court on Function Hall Sound Case : ఫంక్షన్ హాళ్లలో శబ్ధ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు(High Court) ఆదేశాలు జారీ చేసింది. కేవలం రూ.10 వేలు జరిమానా, కేసులు పెడితే ఇవి ఆగవని వ్యాఖ్యానించింది. రూ.10 వేలు చెల్లించేస్తారని పెట్టిన కేసులు తేలడానికి పాతికేళ్లు పడుతుండన్న ధీమాతో ఉంటారని హైకోర్టు అభిప్రాయపడింది. నియంత్రించాలన్న చిత్తశుద్ధి ఉంటేనే తగిన ఫలితాలు కనిపిస్తాయంది. సికింద్రాబాద్ తాడ్బండ్, బోయినపల్లిలోని బాంటియా గార్డెన్స్, ఇంపీరియల్ గార్డెన్స్ ఫంక్షన్ హాళ్ల వల్ల పరిమితికి మించిన శబ్దాలతో ఇబ్బందిగా ఉంటోందని మిలిటరీ అదనపు చీఫ్ ఇంజనీరు కల్నల్ జె.సతీశ్ భరద్వాజ్ హైకోర్టుకు లేఖ రాశారు.
అర్ధరాత్రి 12 గంటలు దాటినా శబ్దాలు పరమితికి మించి ఉంటున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇక్కడ సరైన పార్కింగ్ లేక రద్దీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఖాళీ మద్యం బాటిళ్లు, ఆహార వ్యర్థాలతో అస్తవ్యస్తంగా ఉంటోందని హైకోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. డయల్ 100కు ఫోన్ చేసినా పోలీసులకు ఫిర్యాదు చేసిన తాత్కాలికంగా వచ్చి వెళుతున్నారని కఠిన చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు.
కంటోన్మెంట్ బోర్డుకు నోటీసులు : ఈ లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే(Justice Alok Aradhe), జస్టిస్ జె.అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై పూర్తి వివరణ తీసుకొని చెప్పడానికి గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ కోరారు. అంతేకాకుండా ఇది కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్నందున కంటోన్మెంట్ బోర్డును ప్రతివాదిగా చేర్చాల్సి ఉందన్నారు. దీనికి ధర్మాసనం అంగీకరిస్తూ కంటోన్మెంట్ బోర్డును ప్రతివాదిగా చేర్చుతూ ఆదేశాలు జారీ చేసింది.
ఇది కేవలం సికింద్రాబాద్లోని రెండు ఫంక్షన్ హాళ్లకే పరిమితం కాదని, నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే ఇబ్బంది ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. త్వరలో జరిగే పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని కఠిన చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొంది. జరిమానాలు, కేసులతో సమస్యలు తేలవలని శబ్ధ నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటారో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను హైకోర్టు 7వ తేదీకి వాయిదా వేసింది.