High Court Issues Notice to Govt to Relocate Bar and Restaurant :నగరంలోని హయాత్‌నగర్ నుంచి సాహెబ్‌నగర్ వెళ్లే దారిలో ప్రధాన రహదారిపై నివాసాల మధ్య సాయి యువ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆబ్కారీ, హోం శాఖల ముఖ్యకార్యదర్శులు, జీహెచ్ఎంసీ(GHMC), రాచకొండ పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తమ కాలనీలో నివాసాల మధ్య ప్రధాన రహదారిపై సాయి యువ బార్ ఏర్పాటుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై 6వ తరగతి విద్యార్థిని వైష్ణవి హైకోర్టుకు లేఖ రాసింది.
బార్‌కు 70 మీటర్ల దూరంలో విద్యా సంస్థలు : ఫిబ్రవరి 29న అందిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం(Public Interest Litigation)గా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ట్ అనిల్ కమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బార్‌కు 70 మీటర్ల దూరంలోనే పలు విద్యా సంస్థలున్నాయని లేఖలో పేర్కొంది. చుట్టూ పలు కాలనీలు ఉండటంతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుందని తెలిపింది. ఈ ప్రాంతంలోని కోచింగ్ సెంటర్లలో సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు తరగతులు ఉంటాయని, ఈ సమయంలో పిల్లలను ఒంటరిగా పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారని లేఖలో పేర్కొంది.