Helicoptor Digital Survey : చిన్న పట్టణాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో భాగంగా కేంద్రం నక్షా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కేంద్ర, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, భూ పరిశోధన శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారుల బృందం ఏరియల్ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ గగనతలంలో దాదాపు 3 గంటల పాటు హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. హెలికాప్టర్‌కు అమర్చిన అత్యాధునిక సాంకేతికత, నాణ్యత కలిగిన కెమెరాలతో ఏరియల్ భూ సర్వే చేసినట్లు పుర కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
పట్టణంపై 3 గంటల పాటు హెలికాప్టర్ చక్కర్లు - టెన్షన్లో గ్రామస్థులు! - చివరకు? - HELICOPTOR DIGITAL SURVEY IN TG
యాదగిరిగుట్టలో నక్షా కార్యక్రమం - హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహణ - 3 గంటల పాటు కొనసాగిన సర్వే
![పట్టణంపై 3 గంటల పాటు హెలికాప్టర్ చక్కర్లు - టెన్షన్లో గ్రామస్థులు! - చివరకు? Helicoptor Digital Survey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/1200-675-23533317-thumbnail-16x9-survey.jpg)
Published : Feb 13, 2025, 11:54 AM IST
ఈ కెమెరాల ద్వారా చిత్రించిన ఫిజికల్ ఫొటోలు, వీడియోలు అక్షాంశాలు, రేఖాంశాల రూపంలో రికార్డులు రూపొందించి, వాటిని డిజిటలైజేషన్ చేయనున్నట్లుగా పేర్కొన్నారు. సర్వేలో విస్తీర్ణంతో పాటు ప్రభుత్వ భూముల గుర్తింపు, గృహాల సంఖ్య, మురికి వాడలు, చెరువులు, కాల్వలు, నాలాలు, హద్దులు, ఆక్రమణలు గుర్తించనున్నట్లుగా తెలిసింది. పట్టణంలోని 42 పాయింట్లను ఏర్పాటు చేసి 2డీ, 3డీ, 4డీ సెన్సార్ కెమెరాలతో చిత్రాలు తీయడానికి వినియోగిస్తున్నారు. ఈ నక్ష ప్రాజెక్టు కింద దేశంలో మొత్తం 100 పట్టణాలను ఎంపిక చేయగా, రాష్ట్రంలో 10 పురపాలకలను ఎంపిక చేయడం, అందులో యాదగిరిగుట్ట పురపాలిక ఉండటం విశేషం. ఇదిలా ఉండగా, పట్టణంపై హెలికాప్టర్ చక్కర్లు కొడుతుండటంతో ఏం జరుగుతుందో తెలీక స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. చివరకు అధికారుల ద్వారా అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.