Heavy Rain Alert for Telangana : ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద ఉన్న వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఈరోజు ఒడిశా తీరంలో ఉన్న చిలుకా సరస్సు వద్ద కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవన ద్రోణి ఇవాళ జైసల్మర్, అజ్మీర్, మాండ్ల, రాయిపూర్తో పాటు ఒడిశా తీరం వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం గుండా వెళుతూ, తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుందని తెలిపింది.
దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రేపు కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రాష్ట్రంలో ఈ 2 రోజులు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు.
పెద్దవాగుపై సీఎంకు వివరణ : ఇదిలా ఉండగా ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. అధికారులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిస్థితులను ఎప్పటికప్పుడు చక్కదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే భద్రాద్రి జిల్లాలోని పెద్ద వాగు పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీయగా, పెద్దవాగు ప్రాజెక్టు స్థితిగతులు, నష్టపోయిన రైతుల గురించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.
పెద్దవాగు ఉద్ధృతితో అశ్వారావుపేట అతలాకుతలం - స్తంభించిన జనజీవనం, ముంపు ప్రాంతాల్లో చిమ్మచీకట్లు
ఈ సందర్భంగా అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు వరద బీభత్సం వల్ల నష్టపోయిన రైతాంగం వివరాలు సేకరించాలని సీఎం రేవంత్ సూచించారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని మంత్రి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. పోటెత్తిన భారీ వరదల ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం పెట్టుబడి రాయితీ అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తుందని తుమ్మల పేర్కొన్నారు.
కారు రివర్స్ చేస్తుండగా విరిగిపడిన భారీ వృక్షం : మరోవైపు హైదరాబాద్‌లో ఉదయం నుంచి కురుస్తున్న చిరుజల్లులతో నగరవాసులంతా దాదాపు ఇళ్లకే పరిమితమయ్యారు. పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడటంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో మణికొండలోని పంచవటి కాలనీలో ఈదురు గాలులతో కూడిన వర్షం ధాటికి అపార్ట్మెంట్ ముందున్న ఓ భారీ వృక్షం నేలకొరిగింది. అదే సమయంలో ఓ వ్యక్తి కారును రివర్స్ చేస్తుండగా దానిపై పడింది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసం కాగా, కారు నడిపే వ్యక్తి అందులోనే చిక్కుకుపోయాడు. డోర్స్ లాక్ అయిపోవడంతో బయటకు రాలేకపోయాడు. గమనించిన స్థానికులు కారు అద్దాలను పగులగొట్టి అతడిని బయటకు లాగారు. ఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
భద్రాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం - లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం - Bhadradri Water level Increased