Telangana Rains News : రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని, ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నేడు సాయంత్రం హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.