Heavy Rains in Mahabubnagar : మహబూబ్‌నగర్ పట్టణంలో జగ్జీవన్‌రాంనగర్ కాలనీ, కుర్హిని శెట్టి కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. జడ్చర్ల పట్టణంలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదనీరు చుట్టుముట్టి జడ్చర్ల ప్రభుత్వాసుపత్రి, ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలోకి నీరు చేరి రోగులు ఇబ్బంది పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో పంటచేలు నీట మునిగాయి. వడ్యాల్ గ్రామ శివారులో కేఎల్‌ఐ కాల్వలో ఉద్ధృతి కారణంగా కట్ట తెగి పంటపొలాల్లోకి నీరు చేరుతోంది. ఎత్తం, మైలారం గ్రామాల్లో వరిపంట నీట మునిగింది.
ఇల్లు కూలి మృతి :నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామంలో ఇల్లు కూలి తల్లి, కుమార్తె మృత్యువాత పడ్డారు. సరళసాగర్ గేట్లు తెరచుకోవడంతో మదనాపురం- ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చంద్రవాగు ఉద్ధృతికి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి చౌటపల్లి మీదుగా బాణాల, బిల్లకల్లు, వెంకటగిరి గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి- మాధవస్వామి నగర్, మంచాలకట్ట మధ్యనున్న వంతెనపై వరదనీరు పారడంతో రాకపోకలు ఆగిపోయాయి.
నిలిచిన రాకపోకలు : మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ సమీపంలో కల్వర్టు తెగిపోవడంతో తాండూరు- మహబూబ్‌నగర్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గట్టు రావిపాకుల దగ్గర వాగుపొంగి గట్టు రావిపాకుల- గడ్డంపల్లి వైపు దారి లేకుండా పోయింది. తెలకపల్లి మండలం రామగిరి వద్ద వాగు ఉద్ధృతికి తెలకపల్లి- కల్వకుర్తి పట్టణాలకు వాహనాల రాకపోకలు నిలిపివేశారు.