Heavy Rains In Hyderabad Today :రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రహదారులు చెరువుల్ని తలపించాయి. సోమవారం రాత్రి మొదలైన వర్షం మంగళవారం కూడా కురిసింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. మరో రెండ్రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.
జీఎం, డీజీఎం, మేనేజర్‌లతో ఎండీ అశోక్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మ్యాన్ హోళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రయాణాలకు తీవ్ర అంతరాయం :నగరంలో ఉదయం నుంచి కురిసిన వర్షానికిచాదర్ఘాట్ ఆజంపురా రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సకాలంలో డ్రైనేజీల్లో పూడికతీత చేపట్టకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని సంబంధిత అధికారులు సిబ్బంది తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు రహదారులపై చేరిన నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది కాలువల్లోకి మళ్లిస్తున్నారు. నాలాలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో స్థానికులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. పురాతన శిథిల భవనాల పరిసరాల్లో ఎవరూ ఉండొద్దని మహానగర పాలక సంస్థ సూచించింది.