తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు - Heavy Rains In Hyderabad - HEAVY RAINS IN HYDERABAD

Heavy Rains In Hyderabad : బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా హైదరాబాద్‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. హైదరాబాద్‌లోని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్‌ సోమవారం సెలవు ప్రకటించారు.

Rains In Hyderabad
Heavy Rains In Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 6:25 AM IST

Updated : Sep 1, 2024, 6:45 AM IST

Rains In Hyderabad : అల్పపీడనం నేపథ్యంలో హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నిన్న ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ మధ్యలో కాస్త తెరిపి ఇచ్చి తిరిగి వర్షం కురిసింది. మరోసారి రాత్రి 9 గంటల నుంచి భారీ వర్షం కురిసింది.

సికింద్రాబాద్‌, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, తార్నాకా ఖైరతాబాద్‌, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, లింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు మళ్లించారు. మరికొన్ని వాహనాలను నార్కట్‌పల్లి, అద్దంకి వైపు మళ్లించారు. వర్షాల కారణంగా అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌లో 59 పునరావాస కేంద్రాలు :భారీ వర్ష సూచనతో హైదరాబాద్ జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల వారి కోసం హైదరాబాద్‌లో 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో సోమవారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించామని కలెక్టర్‌ తెలిపారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అధికారులను కోరారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: రాష్ట్రవ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నందున అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వర్షాల ప్రభావంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో మాట్లాడారు. రెవెన్యూ, మున్సిప‌ల్‌, విద్యుత్‌, వైద్యారోగ్య శాఖాధికారులందరినీ అప్రమత్తం చేయాలని సీఎస్​కు సీఎం తెలిపారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా చూడాల‌ని చెప్పారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించాల‌ని సీఎం ఆదేశించారు. రిజ‌ర్వాయ‌ర్ల గేట్లు ఎత్తే చోట దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, మున్సిపల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు

అల్పపీడనం ప్రభావంతో దంచికొడుతున్న వర్షాలు - పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు - Heavy Rains in AndhraPradesh

తెలంగాణను వణికిస్తున్న వరుణుడు - ఇబ్బందులు పడుతున్న ప్రజానికం - Heavy Rains IN Telangana

Last Updated : Sep 1, 2024, 6:45 AM IST

ABOUT THE AUTHOR

...view details