తెలంగాణ

telangana

ETV Bharat / state

తీరం దాటిన వాయుగుండం - కోస్తా జిల్లాలు అల్లకల్లోలం

తుఫాను తీరం దాటే సమయంలో అల్లకల్లోలంగా మారిన సంద్రం - పలుచోట్ల నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంబాలు

Rains Effect In AP
Rains Effect In AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2024, 7:26 PM IST

Updated : Oct 17, 2024, 8:03 PM IST

Rains Effect In AP :వాయుగుండం తీరం దాటాక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ జిల్లాలు వాయుగుండం తీవ్రతకు భారీగా నష్టపోయాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ తీరంలో ఇళ్లు కోతకు గురయ్యాయి. సీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. పరిస్థితిపై కలెక్టర్లతో సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.

అల్లకల్లోలంగా మారిన సముద్రం :తుపాను తీరం దాటే సమయంలో కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. బుధవారం రాత్రి నుంచి రాకాసి అలలు ఎగసిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ఉప్పాడ, సూరాడపేట, మాయాపట్నం, జగ్గరాజుపేట, కోనపాపపేటలో చాలా ఇళ్లు కోతకు గురయ్యాయి. కొన్ని ఇళ్లు ఓ పక్కకు ఒరిగి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ ఇళ్లలో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. బాధిత ప్రాంతాల్లో పర్యటించిన కాకినాడ ఆర్డీవో మల్లిబాబు వివరాలు నమోదు చేసుకున్నారు. బాధితుల్ని పరామర్శించిన పిఠాపురం తెలుగుదేశం ఇన్‌ఛార్జ్‌ వర్మ అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

అరకిలోమీటర్​ మేర ముందుకు వచ్చిన సముద్రం : డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొన్నిచోట్ల అర కిలోమీటర్ మేర సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. అంతర్వేదిలో సముద్రపు నీరు పోటెత్తింది. పల్లిపాలెం, మలికిపురం మండలం కేశవదాసుపాలెం, చింతలమమోరి, శంకరగుప్తం, పడమటిపాలెం, కేసనపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెంలో ఇళ్లలోకి నీరు చేరింది. తీరంలోని ఆక్వా చెరువులు నీట మునిగాయి. ఓఎన్​జీసీ టెర్మినల్‌ను సముద్రపు నీరు ముంచేసింది. టెర్మినెల్ గోడ వెనుకవైపు కోతకు గురైంది.

1700 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు :ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వర్షాలకు సజ్జ రైతులు నిండా మునిగారు. కనిగిరి, వెలిగండ్ల, చంద్రశేఖరపురం మండలాల్లో 17వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వైఎస్సార్​ జిల్లా పెద్దముడియంలో కుందూ నది ఉద్ధృతితో గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ముద్దనూరు మండలంలో పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఉల్లి పంట దెబ్బతింది. చిన్నకత్తెరపల్లెలో మట్టిమిద్దె కూలింది. ఎగువ నుంచి వరద రావడంతో సిద్ధవటం వద్ద పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో వరి నారుమళ్లు నీళ్లలోనే నానుతున్నాయి.

వాయుగుండం తీరం దాటడంతో నెల్లూరు జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కొన్నిచోట్ల పొలాలు నీటిలోనే ఉన్నాయి. వర్షంతో సోమశిల జలాశయం జలకళ సంతరించుకుంది. కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. రెండో పంటకు సాగునీటి సమస్య రాదని రైతులు అంటున్నారు. ఆత్మకూరు, నెల్లూరు గ్రామీణం, కోవూరు నియోజకవర్గాల్లోని జగనన్న కాలనీల్లోకి నీరు చేరింది.

లోతట్టు ప్రాంతాలు జలమయం :ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో మిరప, కంది, జొన్న, వరి మడుల్లోకి నీరు చేరడంతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం పడటం వల్ల చిత్రావతి జోరు మీదుంది. రాయలవారిపల్లి, కోవెలగుట్టపల్లి చెక్‌డ్యాంలు, చిత్రావతి చెక్ డ్యాం నిండుకుండల్లా మారాయి. చిత్రావతి హోరుతో కొన్ని గ్రామాలకు రాకపోకలు ఆగాయి. కొత్తచెరువు మండలం కనిశెట్టిపల్లిలో మిద్దె కూలిపోయింది.

విశాఖ జిల్లా కొంగపాలెంలో వర్షాలకు కొండవాలు ప్రాంతంలో ఇల్లు కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జోరు వానలు పడ్డాయి.

కోనసీమలో రాకాసి అలల బీభత్సం - అరకిలోమీటరు ముందుకొచ్చిన సముద్రం

తుపాన్లకు పేర్లు ఎవరు, ఎలా పెడతారు? - వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

Last Updated : Oct 17, 2024, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details