Heavy Rain in Hyderabad : ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగింది. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి వాతావరణం చల్లబడింది. నగరంలోని ఖైరతాబాద్, కూకట్పల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్, బంజారాహిల్స్ సహా పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. కొద్దిపాటి వర్షానికే నీరంతా రోడ్లపైకి వచ్చి చేరడంతో పలుచోట్ల వాహనదారులు ఇబ్బందిపడ్డారు. వర్షానికి ఎక్కడా జనం ఇబ్బంది పడకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎక్కడా నీళ్లు నిలిచిపోకుండా, డ్రైనేజ్ పొంగిపొర్లిన చోట ప్రజలకు ఇబ్బంది లేకుండా బల్దియా సిబ్బంది చర్యలు చేపట్టారు.
టోలిచౌకిలో కూలిన భారీ చెట్టు : హైదరాబాద్ నగరంలో భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసిముద్దయ్యారు. ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. టోలిచౌక్ గోల్కొండ ఎండి లైన్స్‌లోని ఈదురు గాలులతో 200 సంత్సరాల నాటి చెట్టు నేలకొరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తలకు గాయాలు కాగా, 4 బైక్స్ ధ్వంసమయ్యాయి.
Heavy Monsoon Rainfall in Hyderabad : జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించటంతో, పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భాగ్యనగరంలోని నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్, ఖైరతాబాద్‌లో తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వాన నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.