తెలంగాణ

telangana

ETV Bharat / state

నిన్నంతా ముసురు వాన - ఇవాళ తేలికపాటి వర్షాలు - రాష్ట్ర ప్రజలకు ఐఎండీ అలర్ట్ - TELANGANA RAIN ALERT TODAY - TELANGANA RAIN ALERT TODAY

Cyclone Effect In Telangana : అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ముసురేసింది. నిన్నటి నుంచి తేలికపాటు జల్లులు కురుస్తూనే ఉండగా, పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ కూడా పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.

Cyclone Effect In Telangana
Cyclone Effect In Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 21, 2024, 7:20 AM IST

Updated : Jul 21, 2024, 7:57 AM IST

Heavy Rain In Telangana :రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతుండగా, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మబ్బులు ముసిరేసి, తేలికపాటు జల్లులు కురుస్తుండగా, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి.

నిజామాబాద్ జిల్లాలో 13.2 వర్షపాతం : ముప్కాల్ మండలం వేంపల్లెలో అత్యధికంగా 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బాల్కొండ , ఎల్లారెడ్డి ప్రాంతాలలో భారీ వర్షం పడుతోంది. నిజామాబాద్ రూరల్, ఇందల్వాయి, సిరికొండ మండలాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. నిన్నంతా తేలికపాటి వర్షం కురిసి సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో నిజామాబాద్‌ నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో ఒకట్రెండు రోజుల్లో చెరువులు మత్తడి దూకే అవకాశాలున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్​లో పొంగుతున్న వాగులు : ఎగువ నుంచి ప్రవాహంతో నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులకు గానూ, ప్రస్తుతం 690అడుగులకు పైగా చేరింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి సమీపంలోని మత్తడివాగు వద్ద లోలెవెల్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తుంది. ఓ పోస్టాఫీస్‌ ఉద్యోగి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వరదలో వాహనం కొట్టుకుపోయింది. అప్రమత్తమైన స్థానికులు తాళ్లసాయంతో కాపాడారు.

కుమురంభీం జిల్లాలో రెడ్ అలర్ట్ : వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అసిఫాబాద్ మండలం తుంపల్లి వాగును కలెక్టర్ వెంకటేశ్‌ దోత్రే, ఎస్పీ పరిశీలించారు. ఉప్పొంగుతున్న వాగుల వద్ద ముందు జాగ్రత్తగా పోలీసు పహారా ఏర్పాటు చేశారు. కుమురం భీం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రావు ప్రాజెక్టును సందర్శించి, పరిస్థితిని తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

జిల్లాలో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. త్రివేణి సంగమం తీరం వద్ద 8.32 మీటర్లకు పైగా ఎత్తులో మెట్లపై నుంచి వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద, రాష్ట్రంలో వర్షాలతో మేడిగడ్డ బ్యారేజీకి భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. 85 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ దెబ్బతిన్నట్లు గుర్తించిన నాటి నుంచి తొలిసారిగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.

ఎన్ఎస్డీఏ సూచనల మేరకు బ్యారేజీలో నీటిని నిల్వ చేయటంలేదు. అన్నారం బ్యారేజీకి సైతం వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 16వేల 500 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, 66 గేట్లు ఎత్తి, అంతే స్థాయిలో దిగువకు నీటిని వదులుతున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షానికి భూపాలపల్లిలో మూడు రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచింది. కేటీకే-1, 2, 3 ఉపరితల గనుల్లో బొగ్గుతో పాటు మట్టి పనులు నిలిచిపోయాయి.

వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు- గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు - Rains in Andhra Pradesh 2024

ములుగు జిల్లాలో భారీ వర్షాలు : వాజేడు మండలంలోని బొగత జలపాతంలో పాలనురుగులా జలధారలు కనువిందు చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం సీతానాగారంలో భీమునిపాదం జలపాతం ఆకట్టుకుంటోంది. బయ్యారం పెద్ద చెరువు, భద్రకాళీ చెరువు, హనుమకొండ వడ్డేపల్లి చెరువులూ మత్తడి పోస్తున్నాయి. అలుబాక సమీపంలోని గోదావరిలో చేపల వేటకు వెళ్లి శుక్రవారం గల్లంతైన బానారి పగిడిద్దరాజు మృతదేహం శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం సమీపంలోని గోదావరిలో లభ్యమైంది.

నడికుడ మండలం కంటాత్మకూర్ వాగు వద్ద నూతన బ్రిడ్జి పునరుద్ధరణతో తాత్కాలికంగా వేసిన రోడ్డు తెగిపోవటంతో వాహనాలను దారి మళ్లించారు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు, ఏటూరునాగారం వద్ద కూడా గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జంపన్న వాగు పొంగిపొర్లుతుండడంతో ఎలిశెట్టిపల్లి, కొండాయి, మల్యాల గ్రామాల మధ్య పడవలతో రవాణా కొనసాగిస్తున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. శనివారం రాత్రికి 35.5 అడుగులకు నీటి మట్టం చేరింది. ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తుండడంతో ఇవాళ మరిన్ని అడుగుల నీటిమట్టం పెరగనుందని కేంద్ర జల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని లింగాపురంపాడు గ్రామ సమీపంలోని చెరువు కట్టపై నుంచి వరదప్రవాహం ప్రధానరహదారిపైకి చేరి, కొత్తపల్లి, లింగాపురం, కొంపల్లి, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

చర్ల మండలంలోని తాళిపేరు జలాశయానికి భారీగా వచ్చి వరద నీరు చేరుతుంది. నిన్న 25 గేట్లు ఎత్తి లక్షా 45వేల 78 క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు. దుమ్ముగూడెం మండలం కే.లక్ష్మీపురం - గౌరారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం నీట మునిగి సీతవాగు ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. గుబ్బలమంగి వాగు ఉప్పొంగుతోంది. ఖమ్మం జిల్లా మధిరలో వైరానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

ఉరకలేస్తున్న కృష్ణమ్మ : కృష్ణా నది సైతం ఉప్పొంగుతోంది. ఈ ఏడాది తొలిసారిగా జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవటంతో శ్రీశైలానికి కృష్ణమ్మ చేరుకుంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో, జూరాల ప్రాజెక్టులోకి 83 వేల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో శనివారం రాత్రి వరకూ 17 గేట్లు తెరిచి 99వేల 894 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

నెట్టెంపాడు, బీమా ఎత్తిపోతలకు, జూరాల కుడి, ఎడమ కాల్వలకు కలిపి 5,500క్యూసెక్కులు తరలిస్తున్నారు. అటు ఆల్మట్టి ప్రాజెక్టుకు ఒకలక్షా 5వేల క్యూసెక్కులు నీరు చేరుతుండగా, అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయానికి లక్షా 11 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 22 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

బంగాళాఖాతంలో వాయుగుండం : పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశా - చత్తీస్‌గఢ్ వైపు వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలకు అవకాశం ఉందని సూచించింది. ఆదివారం ఆదిలాబాద్, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీగా, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

'ముసురు' పట్టిన తెలంగాణ - మరో 5 రోజుల పాటు పొంచి ఉన్న వరుణుడి ముప్పు - heavy rain fall in telangana

Last Updated : Jul 21, 2024, 7:57 AM IST

ABOUT THE AUTHOR

...view details