Heavy Rain Alert To Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లుగా విశాఖ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ను అందించింది. దక్షిణ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం రానున్న 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీలోని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, ఉత్తరకోస్తాలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ నెల 28, 29వ తేదీన ఏపీలోని నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే కోస్తాంధ్రలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేసినట్లుగా వెల్లడించింది. ఉత్తర కోస్తా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
కోస్తాంధ్రలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ :దక్షిణ బంగాళాఖాతం, తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాల్లో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 30కిమీ వేగంతో వాయుగుండం కదులుతుంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, నాగపట్నానికి 810 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 920, చెన్నైకి ఆగ్నేయంగా 1000 కిమీ దూరంలో కేంద్రీకృతమైవుందని ఎస్డీఎమ్ఏ తెలిపింది. రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆ తర్వాత 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.