Medigadda Floods Updates :కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలో 85 గేట్లు పూర్తిస్థాయిలో ఎత్తి 8లక్షల 19వేల 500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీకి 16వేల 850 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో 66 గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు.
Kaleshwaram Floods Latest News :మరోవైపు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. వరద ప్రవాహంతో గోదావరి, ప్రాణహిత ఉభయ నదులు ఉప్పొంగడంతో పుష్కర ఘాట్లు, స్నాన ఘాట్లలను వరద ముంచెత్తింది. మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి పుష్కర ఘాట్ల వద్ద స్థానికులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. వరద ఉద్దృతికి పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచాయి.
Flood Water Flows to Sriram Sagar Project:నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 20.518 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వర్షాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండుకున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నూర్, కోటపల్లి మండలాల గుండా ప్రవహించే ప్రాణహిత, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ కూడా బయటికి రావద్దని అధికారులు హెచ్చరించారు.